- అందంగా ముస్తాబైన చౌరస్తాలు
అడవుల జిల్లా ఆదిలాబాద్ నయా లుక్ సంతరించుకుంటోంది. జిల్లా కేంద్రంలో అభివృద్ది శరవేగంగా కొనసాగుతుండటంతో రోడ్లు తలాతలా మెరుస్తున్నాయి. సుందరీకరణలో భాగంగా చౌరస్తాలను అందంగా ముస్తాబు చేస్తుండటంతో ఆదిలాబాద్ పట్టణ కేంద్రం కొత్త కాంతులతో తలుక్కుమంటోంది. మొన్నటి వరకు వర్షం పడితే గుంతలమయమై నరక ప్రాయమైన ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రోడ్లు.. మున్సిపాలిటీ అభివృద్దిలో భాగంగా రోడ్ల విస్తరణ జరగడంతో అందంగా కనిపిస్తున్నాయి. జగ్జీవన్ రావ్ చౌక్ , వినాయక్ చౌక్ , ఎన్టీఆర్ చౌక్ , కొమురంభీం చౌక్ ఇలా వరుసగా కూడళ్లు కొత్త శోభను సంతరించుకుంటూ పట్టణానికి మరింత కొత్త కళను మోసుకొస్తున్నాయి. అదికారులు నివాసం ఉండే కలెక్టర్ బంగ్లా , ఎస్పీ బంగ్లాలకు సమీపంలో ఐ లవ్ ఆదిలాబాద్ కూడలి ఏర్పాటుతో స్థానికులనే కాదు పర్యాటకులను ఆకట్టుకుంటోంది ఆ కూడలి.
నయా లుక్ చౌరస్తాలు..
ఇప్పటికే మావల ఎక్స్‌రోడ్డు నుంచి చాందా (టి) బ్రిడ్జి వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తికావడంతో సెంట్రల్ లైటింగ్, డివైడర్ ప్లాంటేషన్‌తో రహదారి వెంట ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. పట్టణంలో ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తికావడం.. నూతన హంగులతో ప్రధాన జంక్షన్లు రూపుదిద్దుకోవడంతో సాయంత్రం అయిదంటే చాలు తలుక్కున మెరుస్తున్న లైట్లతో సరికొత్తగా కనువిందు చేస్తున్నాయి.
శరవేగంగా సుందరీకరణ.. కోట్లతో ఆదిలాబాద్ పట్టణాభివృద్ది
2 కోట్ల వ్యయంతో కలెక్టర్‌చౌక్, ఎన్టీఆర్ చౌక్, పంజాబ్ చౌక్, కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్‌లు.. కోటి రూపాయలతో వినాయక్‌చౌక్, క్లాక్‌టవర్, 40 లక్షల వ్యయంతో జగ్జీవన్‌రావ్ చౌరస్తా, 49 లక్షల వ్యయంతో అంబేద్కర్‌చౌక్, 20లక్షల వ్యయంతో నేతాజీచౌక్ లు రూపుదిద్దుకోగా.. 20లక్షల వ్యయంతో వివేకానంద చౌక్ కూడళ్ల సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. శరవేగంగా పనులు సాగడంతో ఆదిలాబాద్ బల్దియా రూపు రేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు చూసిన ఆదిలాబాదేనా ఇది అనే అంతలా అడవుల జిల్లా కేంద్రం కనిపిస్తోంది.
అమరవీరుల గుర్తుగా..
ఆదిలాబాద్ లోని ప్రధాన కూడళ్ల వద్ద అమరవీరుల స్మారక స్తూపాలు, మహావీరుల విగ్రహాలు, వాటర్ ఫౌంటెన్లను నిర్మాణానికి మున్సిపాలిటీ దాదాపు నాలుగుకోట్లు ఖర్చు చేసింది. బస్టాండ్ సమీపంలో తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంత చారి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. అంబేద్కర్ చౌక్ లో రాజ్యంగ ప్రదాత విగ్రహాన్ని ఆవిష్కరించుకుంది. తాజాగా ఆదివాసీ గోండు ముద్దు బిడ్డ కొమురంభీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కలెక్టర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. అమర వీరులను స్మరించికుంటూ ఆదిలాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్, ఎమ్మెల్యే జోగు రామన్న చెపుతున్నారు. ప్రతిపక్షాలు సైతం కితాబిచ్చేలా ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ది చేస్తామని హామీ ఇస్తున్నారు. మరో నాలుగు కోట్ల సుందరీకరణ పనులు పెండిగ్ లో ఉన్నాయి.. అవి కూడా పూర్తయితే అడవుల జిల్లా ఆదిలాబాద్ కేంద్రం భాగ్యనగరానికి ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానిక జనం.