సైకిల్ ఎంట్రీ.. మారనున్న గేర్
హైదరాబాద్, మార్చి 14, (వాయిస్ టుడే )
Bicycle entry.. gear changing
తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమా ఆపార్టీలో మరింతగా వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ కు తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు కూడా ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే ఏ రకంగా చూసినా అది కారు పార్టీకి లాభమేనని, సైకిల్ వస్తే కారు గేర్ మార్చడం ఖాయమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. అయితే టీడీపీ ఓటు బ్యాంకు 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు టర్న్ అయ్యాయి. తర్వాత 2023 ఎన్నికల్లో టీడీపీలో అత్యధికశాతం ఓట్లు కాంగ్రెస్ కు మళ్లాయంటారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉండటంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ తో పాటు ఓటర్లు కూడా గాంధీ భవన్ వైపు మొగ్గు చూపారన్న వాదనలో నిజముంది. 2023 శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు దక్కకపోయినా ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీకి సాలిడ్ గా సీట్లు రావడం కూడా టీడీపీ ఓటు బ్యాంకు సహకారం వల్లనేనన్నది కొందరి విశ్లేషణగా ఉంది. 2018లో మహా కూటమిలో కాంగ్రెస్ తో కలసి టీడీపీ పోటీ చేయడంతో అధికారంలోకి రాలేదన్న కామెంట్స్ కూడా నాడు వినిపించాయి.ఇప్పుడు బీజేపీతో పొత్తుతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రానుందన్న వార్తలు కారు పార్టీ నేతలకు ఖుషీ కబురుగా అనుకోవాల్సి ఉంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా టీడీపీని, కాంగ్రెస్ ను వేరుగా చూడలేరని, అందుకే ఈసారి ఎన్నికల్లో జనం తమ వైపు తిరుగుతారని గట్టి అంచనాలు వినపడుతున్నాయి. రానున్న కాలంలో కేసీఆర్ కూడా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశాలున్నాయి. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను కూడా మళ్లీ రగిలించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, సాగునీరు కూడా అందని పరిస్థితి నెలకొంటుందని చెప్పి ప్రజలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం గులాబీ బాస్ చేస్తారంటున్నారు. మొత్తం మీద టీడీపీ ఎంట్రీతో కారు పార్టీకే లాభమన్న విశ్లేషణలు బాగా వినపడుతున్నాయి.\