టీ కాంగ్రెస్ లో మీనాక్షి మార్క్…
ఒక్కటిగా ప్రతిపక్షాలకు చుక్కలు
హైదరాబాద్, మార్చి 18, (వాయిస్ టుడే)
Meenakshi Mark in Tea Congress...
తెలంగాణ కాంగ్రెస్ అంటేనే తలోదారి అనే చర్చ ఉంటుంది. కానీ హస్తం పార్టీలో సడెస్ ఛేంజెస్ కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించిన మంత్రులు..రూట్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గంలో విభేదాలున్నాయని, సీఎం రేవంత్ రెడ్డికి కొందరు మంత్రులకు పడటం లేదన్న చర్చ ఉండేది. క్యాబినెట్‌లో కొంతమంది మంత్రులు తనకు సహకరించడం లేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో స్వయంగా రేవంత్ రెడ్డి వాపోయిన సందర్భాలున్నాయి.ఇలా మంత్రివర్గంలో గ్యాప్..అసెంబ్లీలోనూ కొట్టొచ్చినట్లు కనిపించేంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతో దాడికి దిగినా..మంత్రులు పెద్దగా పట్టనట్లు ఉంటూ వచ్చారు. తమ తమ శాఖలకు సంబంధించిన అంశం వస్తే తప్ప మిగతా సందర్భాల్లో పెద్దగా రెస్పాండ్ అయ్యే వారు కాదు. ప్రతీ దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది.ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను గమనిస్తే పరిస్థితిలో మార్పు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్‌లో చాలా ఛేంజెస్ వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది. సభలో ఉన్న మంత్రులు, ఇతర సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకున్నారు.ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సమయంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలకు అధికార పక్షం నుంచి దీటుగానే సమాధానం వచ్చింది. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలేవీ చేయడం లేదన్న బీఆర్‌ఎస్ విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుధీర్ఘంగా సమాధానం ఇచ్చి బీఆర్ఎస్‌ను సైలెంట్ చేసే ప్రయత్నం చేశారు.ఇక మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. బీసీ కులగణనపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ఇక కృష్ణా జలాల వివాదంపై ప్రతిపక్షాల విమర్శలపై కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు ఉత్తమ్. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే కేసీఆర్, హరీష్ రావులే కారణమని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదని చెప్పుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రెండు మూడు రోజులుగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పక్షం పైచేయి సాధించే పనిలో పడింది. అసెంబ్లీలో అధికార పార్టీ టీమ్ వర్క్ మొదలైందన్న మాటలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఇది మంచి పరిణామమని చర్చించుకుంటున్నారు నేతలు. అయితే ఇందుకు ఢిల్లీ పెద్దల డైరెక్షనే కారణని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సీఎంకు, మంత్రులకు మనస్పర్ధలు, విభేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, కానీ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తించొద్దని గట్టిగానే చెప్పినట్లు సమాచారం.అసెంబ్లీలో పక్కా కోఆర్డినేషన్‌తో కలిసికట్టుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని దిశానిర్ధేశం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత బడ్జెట్ సెషన్‌లో అధికార కాంగ్రెస్ పక్షంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందట. హైకమాండ్ ఉపదేశం బాగానే పనిచేస్తోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.