6 వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూముల స్వాధీనం!
హైదరాబాద్ ఏప్రిల్ 19
Government lands worth Rs. 6,000 crores seized!
శనివారం హైడ్రా దూకుడు చూపించింది. అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిన వారు ఎంత పెద్దలైనా వదిలి పెట్టలేదు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన కూల్చివేతల్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది. ఆయా భూముల్ని హైడ్రా బోర్డులు కూడా పాతారు. హఫీజ్ పేటలో ఉన్న 17 ఎకరాలను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హైడ్రా గుర్తించింది. ఆక్రమణలు తొలగించి బోర్డు ప ెట్టారు. ఈ పదిహేడు ఎకరాల విలువ రెండు వేల కోట్లకుపైగా ఉటుందని అంచనా. 2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా కృష్ణప్రసాద్ చెబుతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం హాఫీజ్ పేట సర్వేనెంబర్ 79/1 పూర్తి అక్రమం అని చెబుతున్నారు. ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదేనని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైడ్రా ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి అనితేలిందన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు.మరో వైపు జూబ్లీహిల్స్‌లోని రూ.3,900 కోట్ల ప్రభుత్వ భూమిని బాలుడి లేఖ ద్వారా హైడ్రా కబ్జా కాకుండా కాపాడిది. JRC కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని బహిరంగ స్థలంలో అకస్మాత్తుగా అక్కడ కంచెలు వేసేశారు. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఓ బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఆ భూమి రికార్డులను పరిశీలించారు. ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని, ప్రస్తుతం చట్టపరమైన వివాదంలో ఉందని గుర్తించారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసున్నట్టు అక్కడ బోర్డులుంటుండగానే.. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ. అనుమతిలేని లే ఔట్‌తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టిన ఆక్రమణదారులు రెచ్చిపోయారు. హైడ్రా అధికారులు. ఆక్రమించుకున్న వారిపై కేసులు పెట్టారు. అదే సమయంలో వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ లో పలు కాలనీలకు వెళ్లే రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ ఆక్రమించిందని ఫిర్యాదులువచ్చాయి. స్థానికుల ఫిర్యాదుతో అక్రమాలను నేలమట్టం చేసి 8 కాలనీలకు దారి కల్పించింది హైడ్రా. హైడ్రా జిందాబాద్ అంటూ స్థానికులు స్వీట్లు పంచుకున్నారు.
వసంతకు తీరని షాక్
హఫీజ్‌పేట్‌లో సర్వే నెంబర్ 79లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు 39 ఎకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాలు రైల్వే లైన్ల కోసం పోగా.. మిగిలిన 34 ఎకరాలు ప్రస్తుతం ఆయన హ్యాండోవర్లో కొనసాగుతోంది. కొంత స్థలంలో విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టారు. అదంతా ప్రభుత్వ భూమి అని.. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా అంటోంది. ఆ భూముల్లోనే ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి. 17 ఎకరాల ఖాళీ స్థలంలో కోనేరు మురళీకృష్ణకు చెందిన KMK సంస్థ భారీ షెడ్డులు నిర్మించింది. వాటిల్లో సినిమా షూటింగులకు ఇచ్చే సామాగ్రి ఉంచారు. ఉదయమే హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి.. ఆ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. అందులో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు చెందిన ఆఫీస్ కూడా ఉంది. ఇక ఇప్పటికే కట్టేసి అమ్మేసిన విల్లాలు, అపార్ట్మెంట్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూమిని తాను 2005లో కొనుగోలు చేశానన్నారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఆనాటి ప్రభుత్వం తనకు నోటీసులు ఇస్తే.. రెగ్యులరైజేషన్ రుసుములు కట్టి.. 2006లో తన భూమిని క్రమబద్దీకరించుకున్నానని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకుని 20 ఏళ్లు అవుతోందని.. ఆ ల్యాండ్‌పై ఎలాంటి కేసులు కూడా లేవని అంటున్నారు.
సీఎం రేవంత్‌ను కలుస్తా.ఇటీవల హైడ్రా నుంచి తనకు నోటీసులు వచ్చాయన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. తాను స్వయంగా హైడ్రా చీఫ్ రంగనాథ్‌ను కలిసి తన భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, వివరాలు ఇచ్చానని చెబుతున్నారు. ఆ భూములు ‘పైగా’ వంశస్తులవని.. అయితే హైడ్రా మాత్రం ప్రభుత్వ భూములు అంటోందని అన్నారు. ఈ వివాదంపై గతంలో సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని.. అవి ప్రైవేట్ భూములేనని చెప్పిందని ఎమ్మెల్యే వసంత అంటున్నారు. అలాంటిది.. సడెన్‌గా ఉదయం హైడ్రా సిబ్బంది దాడి చేసి తన కార్యాలయాన్ని కూల్చేశారని.. అందులో విలువైన డ్యాక్యుమెంట్లు, రికార్డులు ఉన్నాయని.. కనీసం అవి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా విధ్వంసం చేశారని వాపోతున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఇలా కూల్చేయడం అన్యాయం, అక్రమం, దారుణం అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో లేనప్పుడు హైడ్రా ఇలా రెచ్చిపోవడమేంటని.. ముఖ్యమంత్రి ఉండుంటే తాను వెళ్లి కలిసేవాడినని అన్నారు. అధికారులు ఇలా ఇష్టారాజ్యంగా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.హఫీజ్‌పేట్ సర్వే no 79/1 అనేది పూర్తి అక్రమం అంటున్నారు హైడ్రా సీపీ రంగనాథ్. ఆ 39 ఎకరాల భూమి మొత్తం ప్రభుత్వానిదేనని.. కాపాడాల్సిన బాధ్యత హైడ్రా పైన ఉందన్నారు. ఆ భూమి ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందని.. హైకోర్ట్ డివిజన్ బెంచ్‌లో కేసు నడుస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనను కలిశారని.. హైడ్రా ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి అని తేలిందని చెప్పారు. హైడ్రాకు ఎవరైనా సమానమే అని.. అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు హైడ్రా బాస్ రంగనాథ్.



