Sunday, January 25, 2026

స్కూటర్‌పై 98వేల కిలోమీటర్ల సంకల్పయాత్ర

- Advertisement -

స్కూటర్‌పై 98వేల కిలోమీటర్ల సంకల్పయాత్ర

98,000 km Sankalpa Yatra on a scooter

పాత బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ నడుపుతూ కొడుకు.. వెనుక సీటుపై అమ్మ.. ఒకటీ రెండూ కాదు, ఇలా 98వేల కిలోమీటర్లు తిరిగి తిరుమలకు వచ్చారు ఈ తల్లీకుమారులు.

ఉల్లాసంగా ఉత్సాహంగా దూసుకుపోతున్న వీరిని పలకరించినపుడు ఆసక్తికరమైన అనేక సంగతులు పంచుకున్నారు. స్కూటర్‌ నడుపుతున్న దక్షిణామూర్తి కృష్ణకుమార్‌ది మైసూరు. బెంగళూరులోని ఒక కార్పొరేట్‌ సంస్థలో టీం లీడర్‌గా ఉద్యోగం. 2015లో తండ్రి చనిపోవడంతో అమ్మను బెంగళూరుకు తీసుకువచ్చాడు. జీవన సహచరుడ్ని కోల్పోయిన దుఃఖంలోంచి అమ్మను బయటకు తీసుకురావడానికి రోజూ ఆఫీసు నుంచి వచ్చాక ఆలయాల గురించి చెప్పేవాడు. ఆమె ఎంతో ఆసక్తిగా వినేది. ఒకరోజు ఎందుకో.. ‘ అమ్మా.. నువ్వు ఇప్పటిదాకా ఏయే ఆలయాలు సందర్శించావు?’ అని అడిగాడు. నోటితో కాకుండా తొణికిసలాడే కన్నీటితో అమ్మ సమాధానం చెప్పింది. తన సమీపంలో ఉండే ఒక్క ఆలయానికి కూడా ఆమె ఇప్పటిదాకా వెళ్లనేలేదు అని తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. 68 ఏళ్ల వయసు వచ్చినా ఇల్లు తప్ప ఆమెకు మరో ప్రపంచం తెలీదు. ‘నీకు దేశంలో ఉన్న అన్ని ఆలయాలూ చూపిస్తానమ్మా!’ అని కృష్ణకుమార్‌ తల్లికి మాటిచ్చాడు. ఉద్యోగం చేస్తూ అమ్మకి ఆలయాలన్నీ చూపించడం సాధ్యం కాదని అతనికి అర్థమైంది. 2018లోనే రూ.60 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. 2018 జనవరి 16న తన బజాజ్‌ స్కూటర్‌ మీదే ‘మాతృ సేవా సంకల్ప యాత్ర’ ప్రారంభించాడు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, అస్సోం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌, మణిపుర్‌, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌.. ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ తల్లితో స్కూటర్‌పై తిరుగుతున్నాడు ఈ 45 ఏళ్ల కుమారుడు. నేపాల్‌, భూటాన్‌కూ తల్లితో స్కూటర్‌పైనే వెళ్లాడు. ఇప్పటికి 98,109 కిలోమీటర్లు ప్రయాణించాడు. గురువారం తిరుమలకు చేరుకుని తల్లి చూడరత్నమ్మతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాడు. తన సంకల్పయాత్రకు అవరోధం కాకూడదని కృష్ణకుమార్‌ పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకీ త్యాగం? అని అడిగితే, ‘చనిపోయాక శ్రాద్ధకర్మలు ఘనంగా చేయడం కాదు.. బతికి ఉన్నపుడు సంతోషపెట్టడమే కొడుకుగా నా బాధ్యత’ అని సమాధానం ఇచ్చాడు. ఈ సంకల్ప యాత్రలో ప్రయాణిస్తున్నది ఇద్దరు కాదు, ముగ్గురు. అంటూ తన స్కూటర్‌ వైపు మురిపెంగా చూశాడు. ‘నాకు 21 ఏళ్ల వయసులో నాన్న ఇచ్చిన కానుక ఇది. దీని మీద తిరుగుతూ ఉంటే నాన్న కూడా మాతోపాటే యాత్రలు చేస్తున్నట్టుగా ఉంది. ఈ యాత్రకు ముగింపు లేదు. అమ్మా నేనూ ఓపిక ఉన్నంతదాకా ఇలా తిరుగుతూనే ఉంటాం. ఒక్కో గుడినీ సందర్శిస్తూ ఉంటే అమ్మ గొప్ప ఆనందం పొందుతోంది. నాకు జన్మనిచ్చిన తల్లికి ఇంతకన్నా ఏవిధంగా రుణం తీర్చుకోగలను?’ అని అమ్మను అల్లుకుపోయి ఆనందంగా చెప్పాడు కృష్ణకుమార్‌.
=================================

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్