కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పై దిశానిర్దేశం చేసారు.
బీఆర్ఎస్ కార్పోరేటర్లతో కేటీఆర్ భేటీ
హైదరాబాద్
KTR meets with BRS corporators
తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర ప్రజాప్రతినిధులు హజరయ్యారు. మంగళవారం జరగనున్న కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పై కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేసారు.
పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరఫున కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రెండవసారి జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలను అందించిన విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేసిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికలను పోరాడిన తీరుపైన కేటీఆర్ అభినందనలు తెలిపారు. పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఈనెల 29వ తేదీన జరగనున్న దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు. దీక్ష దివాస్ సంబరాలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో చేయనున్న ఏర్పాట్లపైన మాజీమంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు జరిగినా, కేసీఆర్ గారి దీక్ష తర్వాతనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని ఇంతటి గొప్ప ఘట్టాన్ని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆ దిశగా ఈనెల 29వ తేదీన హైదరాబాద్ నగరంలో భారీగా దీక్ష దివాస్ ను నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.



