బాలీవుడ్ హీ మ్యాన్ ‘ధర్మేంద్ర’ కన్నుమూత –
ముంబై, నవంబర్ 24, (వాయిస్ టుడే)
Bollywood’s He-Man ‘Dharmendra’ passes away –
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత డిశ్చార్జి అయ్యి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.అక్టోబర్ 31న ఆస్పత్రికి తీసుకెళ్లిన క్రమంలో ధర్మేంద్ర చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. రొటీన్ చెకప్ కోసమే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లామని… ఆరోగ్యం నిలకడగానే ఉందని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు. ఆందోళన అవసరం లేదని చెప్పారు. అలా చికిత్స పొందుతూ ఆరోగ్య విషమించి సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్, బాలీవుడ్ ‘హీ మ్యాన్’గా పేరొందారు.ధర్మేంద్ర పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్సులో స్థానిక విల్లే పార్లీ శ్మశాన వాటికకు తరలించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖులు, పొలిటకల్ లీడర్స్ కడసారి చూసేందుకు శ్మశాన వాటికకు తరలివచ్చి నివాళి అర్పించారు. ధర్మేంద్రను గుర్తు చేసుకుంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ దేవోల్. 1935, డిసెంబర్ 8న జన్మించారు. 1954లో ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. 1980లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమమాలినిని రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్ర – ప్రకాష్ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర – హేమమాలినిలకు ఇషా డియోల్, ఆహానా డియోల్ సంతానం. 1960లో ‘దిల్ బీ తేహా హమ్ బీ తేరా’తో కెరీర్ ప్రారంభించిన ఆయన… ‘అన్‌పఢ్’, ‘బందినీ’, ‘అనుపమ’, ‘ఆయా సావమ్ జూమ్ కే’, ‘షోలే’, ధర్మ వీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్ వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన చివరి చిత్రం ‘ఇక్కీస్’. ఇలా దాదాపు 300కు పైగా చిత్రాల్లో తన నటనతో మెప్పించిన ధర్మేంద్ర బాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. యాక్షన్ కింగ్, బాలీవుడ్ హీ మ్యాన్‌గా పేరొందారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించి గౌరవించింది
తొలి సినిమా పారితోషికం 51 రూపాయిులు
సినీ ప్రయాణం పూలపాన్పు కాదు. తొలి సినిమాకు సంతకం చేసే సమయంలో తనకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ వస్తుందని ధర్మేంద్ర ఎంతో ఆశపడ్డారు. కనీసం 500 రూపాయలైనా ఇస్తారని ఉత్సాహంగా ఎదురుచూశారు. కానీ, నిర్మాత టి.ఎం. బిహారీ, ఆయన సహచరుడు ఠక్కర్ తమ జేబుల్లో ఉన్న డబ్బంతా తీసి కేవలం 51 రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. ఈ విషయాన్ని ధర్మేంద్ర స్వయంగా 1977లో ఓ ఉర్దూ మ్యాగజైన్‌లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన మొదట ‘షోలా ఔర్ షబ్నమ్’ సినిమాకు సంతకం చేసినప్పటికీ, ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ ముందుగా విడుదల కావడంతో అదే ఆయన తొలి చిత్రంగా నిలిచింది.ఆ కష్టకాలంలో ఆయనకు అండగా నిలిచింది తొలి చిత్ర దర్శకుడు అర్జున్ హింగోరానీ. చేతిలో ఆ 51 రూపాయలు తప్ప ఏమీ లేని ధర్మేంద్రకు హింగోరానీ తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. అంతేకాదు, భోజనానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఒక రెస్టారెంట్‌కు తీసుకెళ్లి, “ఈ అబ్బాయికి రోజూ రెండు బ్రెడ్ స్లైసులు, వెన్న, ఒక కప్పు టీ ఇవ్వండి. జామ్ మాత్రం వద్దు. అదనంగా తింటే డబ్బులు తీసుకోండి,” అని చెప్పి అప్పు మీద భోజనం పెట్టించారు. ఆ తర్వాత కూడా వీరి బంధం కొనసాగింది. హింగోరానీ తీసిన అనేక చిత్రాలలో, ముఖ్యంగా ‘K’ అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ ఉన్న ‘కహానీ కిస్మత్ కీ’, ‘ఖేల్ కిలాడీ కా’, ‘కాతిలోం కే కాతిల్’ వంటి సినిమాల్లో ధర్మేంద్రనే హీరోగా నటించారు. కొన్ని చిత్రాల్లో ఆయన కుమారుడు సన్నీ డియోల్ కూడా నటించడం విశేషం.’ఫూల్ ఔర్ పత్తర్’ చిత్రంతో స్టార్‌గా ఎదిగిన ధర్మేంద్ర, ‘షోలే’లో పోషించిన వీరూ పాత్రతో చరిత్రలో నిలిచిపోయారు. ‘చుప్కే చుప్కే’తో తన కామెడీ టైమింగ్‌ను నిరూపించుకోగా, ‘యాదోంకీ బారాత్’ వంటి చిత్రాలతో యాక్షన్ హీరోగా స్థిరపడ్డారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తన నటన, నిరాడంబరతతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ధర్మేంద్ర, భౌతికంగా దూరమైనా తన సినిమాల ద్వారా ఎప్పటికీ చిరంజీవిగా నిలిచిపోతారు
ధర్మేంద్ర జీవించారు
భారత సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసిందని అభివర్ణించారు. ధర్మేంద్ర కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదని, ఆయన నిరాడంబరత, వినయానికి ప్రతీక అని కొనియాడారు. ఈ విచారకరమైన సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు. “ధర్మేంద్ర జీ మరణం భారత సినిమాలో ఒక శకం ముగింపు. ఆయన ఒక ఐకానిక్ ఫిల్మ్ పర్సనాలిటీ. ప్రతి పాత్రకు తన అద్భుతమైన నటనతో జీవం పోసి, ఆకట్టుకున్నారు. ఆయన పోషించిన విభిన్న పాత్రలు అసంఖ్యాక ప్రజల హృదయాలను హత్తుకున్నాయి. ధర్మేంద్ర జీ తన నిరాడంబరత, వినయం, ఆప్యాయతతో కూడా ఎంతగానో గౌరవాభిమానాలు పొందారు. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు ఆయన కుటుంబం, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు.ధర్మేంద్ర తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలతో ప్రేక్షకులను అలరించారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని మోదీ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు



