నకిలీ పట్టాలతో పార్కు స్థలం కబ్జా..

సదరు నిర్మాణాలను కూల్చి వేయాలని హైడ్రాకు లేఖ రాసిన శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్..
శేరిలింగంపల్లి, డిసెంబర్ 2(వాయిస్ టుడే): శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్ లో నకిలీ పట్టాలు సృష్టించి పార్క్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఉదంతంలో సదరు నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వే నెంబరు 134,136లలో అంజయ్య నగర్ బస్తి లేఅవుట్ వేశారు. కాలనీలో పార్కుకోసం కొంత స్థలాన్ని కేటాయించగా, సదరు స్థలంలో కొంతకాలం క్రితం అక్రమ నిర్మాణాలు పుట్టుకు వచ్చాయి. ఈ విషయమై ‘జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ శేరిలింగంపల్లి సర్కిల్, జోనల్ కార్యాలయంలో, గ్రేటర్ జిహెచ్ఎంసి కార్యాలయాల్లో పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన జిహెచ్ఎంసి అధికారులు పార్కు స్థలంలో నిర్మాణంలో ఉన్న భవనాలకు జిహెచ్ఎంసి అనుమతులు ఉన్నాయని గుర్తించి, అనుమతులు ఏవిధంగా మంజూరు చేశారనే విషయమై ఆరా తీశారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మంజూరు చేసినట్లుగా సమర్పించిన పట్టా సర్టిఫికెట్ల ఆధారంగా అనుమతులు మంజూరు చేసినట్లు గుర్తించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు లేఖ రాయగా సదరు పట్టాలను తమ కార్యాలయం జారీ చేయలేదని వివరణ వచ్చింది. నకిలీ పట్టాలతోనే సదరు నిర్మాణాల పుట్టుకు వచ్చాయని గుర్తించి శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ హైడ్రా అధికారులకు లేఖ రాశారు. లేఖ ఆధారంగా హైడ్రా అధికారులు త్వరలోనే అక్రమ నిర్మాణాలకు కూల్చివేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.


