నో హెల్మెట్, నో పెట్రోల్
తిరుపతి, డిసెంబర్ 10, (వాయిస్ టుడే )
No helmet, no petrol
తిరుపతిలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు డిసెంబర్ 15 నుండి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయరు. రోడ్డు ప్రమాద సంబంధిత మరణాలను తగ్గించడానికి జిల్లా పోలీసులు ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ నియమాన్ని కఠినంగా అమలు చేయనున్నారు.జాతీయ రోడ్డు ప్రమాదాల డేటా ప్రకారం దాదాపు 45 శాతం ప్రమాద మరణాలు ద్విచక్ర వాహనదారుల వల్లే సంభవిస్తున్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అతివేగం, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నారు.వాహనదారుడు, పిలియన్ రైడర్ ఇద్దరూ హెల్మెట్లు సరిగ్గా ధరిస్తే ఇలాంటి మరణాలలో 40 శాతం నివారించవచ్చని ఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాద మరణాలు కుటుంబంపై మానసికంగానే కాకుండా ఆర్థిక భారాన్ని కూడా కలిగిస్తాయన్నారు. దీనికి సంబంధించి, తిరుపతి జిల్లా పోలీసులు జిల్లా అంతటా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ఇవి డిసెంబర్ 15 వరకు కొనసాగుతాయి.ప్రజలు ఈ నియమాన్ని అర్థం చేసుకోవడానికి, పాటించడానికి మేం తగినంత సమయం ఇస్తున్నాం. రైడర్, పిలియన్ రైడర్ ఇద్దరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. డిసెంబర్ 15 తర్వాత, హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని ఎస్పీ అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల యజమానులకు ఈ అమలు ప్రణాళిక గురించి ఇప్పటికే సమాచారం అందించారు తిరుపతి పోలీసులు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయకూడదని, ఈ మేరకు పోలీసులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఏపీలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. నవంబర్ 5వ తేదీ దాకా సగటున రోజుకు 50 ప్రమాదాలు జరగ్గా.. అందులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 53 మంది వరకు క్షతగాత్రులు అవుతున్నారు. వాహనాలు అతివేగంగా వెళ్లడం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అధిక ప్రమాదాలు ఉన్నాయి. క్లిష్టమైన జిల్లాలుగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందిలోపు మరణాలు, జరిగిన జిల్లాల లిస్టులో విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి.


