జియోట్యాగింగ్‌తో తప్పిపోయిన వారి చెక్
వరంగల్, జనవరి 21, (వాయిస్ టుడే )
Missing person check with geotagging
దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి సరికొత్త సాంకేతిక సొబగులను అద్దుకుంటోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతర కోసం తెలంగాణ
ప్రభుత్వం, పోలీస్ శాఖ ముందెన్నడూ లేని విధంగా కృత్రిమ మేధ (AI) పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నాయి. భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, జాతర ప్రాంగణంలోని
కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు.జాతరలో భద్రతను పర్యవేక్షించేందుకు ‘మేడారం 2.0’లో భాగంగా ‘టీజీ-క్వెస్ట్’ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు 30 చదరపు కిలోమీటర్ల
మేర విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీగా ఉండే రహదారులపై ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచుతాయి. కేవలం డ్రోన్లే కాకుండా.. ఆకాశంలో ఎగిరే హీలియం బెలూన్లకు పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలను
అమర్చారు. ఇవి అత్యంత ఎత్తు నుంచి కూడా రద్దీని విశ్లేషించి, తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తాయి. దాదాపు 13 వేల మంది పోలీసు సిబ్బంది ఈ
అత్యాధునిక నిఘా నీడలో విధులు నిర్వహించనున్నారు.గత జాతరలో సుమారు 30 వేల మంది వరకు తప్పిపోయిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి వొడాఫోన్-ఐడియా సహకారంతో ‘జియోట్యాగ్
బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ వ్యవస్థను సిద్ధం చేశారు. పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ కలిగిన జియోట్యాగ్‌లను కడతారు. ఒకవేళ ఎవరైనా
తప్పిపోతే, ఈ ట్యాగ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు
హిందీ, తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు.జాతరలో శాంతిభద్రతల కోసం 12 ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద ముఖ గుర్తింపు
సాంకేతికత ద్వారా పాత నేరస్థులను ఇట్టే పసిగట్టవచ్చు. అలాగే అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్-టైమ్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం 2,000 ఎకరాల్లో 37 పార్కింగ్
ప్రదేశాలు, 50కి పైగా అనౌన్స్‌మెంట్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ గద్దెల ప్రాంగణాన్ని పునఃప్రారంభించి, పైలాన్‌ను ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను
దర్శించుకున్న సీఎం.. తన మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వనదేవతల దర్శనం ప్రశాంతంగా సాగేలా చూడాలని
అధికారులను ఆదేశించారు.


