టెండర్ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు: భట్టి
*పెట్టుబడులు, కట్టుకథలు, పిట్టకథల విష పలుకులతో తప్పుడు ప్రచారానికి రాధాకృష్ణ తెరలేపారు
*డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క
Congress government was not there when tender documents arrived: Bhatti
హైదరాబాద్ జనవరి 24
సింగరేణిపై కొన్ని రోజులుగా కొన్ని కట్టుకథలు, రాతలు వచ్చాయని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. పెట్టుబడులు, కట్టుకథలు, పిట్టకథల విష పలుకులతో తప్పుడు ప్రచారానికి రాధాకృష్ణ తెరలేపారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజా భవన్ లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రకరకాలుగా అపోహలు ప్రచారం చేశారని, రాష్ట్ర ప్రభుత్వంపై కావాలని తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. ఏ రాబంధులు, ఏ గద్దలు, ఏ దోపిడీ దారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్టు కనిపిస్తోందని తెలియజేశారు. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో? అని..తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో? అని సందేహం వ్యక్తం చేశారు.అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారని, సింగరేణి కథనంపై రెండు అంశాలు లేవనెత్తారని మండిపడ్డారు. అందరికీ వాస్తవాలు తెలియజేసేందుకు డాక్యుమెంట్లు కూడా ఇస్తామని అన్నారు. బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాయడం మంచిదేనని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారణ చేస్తామనడం కూడా మంచిదేనని భట్టి పేర్కొన్నారు. అందరి నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని, 2018 లోనే టెండర్ డాక్యుమెంట్ కోల్ ఇండియా తయారు చేసి పంపించిందని అన్నారు. సైట్ విజిట్ తప్పనిసరి అని కోల్ ఇండియానే పెట్టిందని, నిజానిజాలు బయటకు రావాలని.. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పారు. పత్రికలు, నాయకులే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, టెండర్ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదని అన్నారు. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచిందని, అడ్డగోలు ప్రచారం చేసేవారి అసలు రూపం బయటపడాలని అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ఎన్ఎమ్ డిసి కూడా చెప్పిందని, రైల్వే శాఖలో కూడా టెండర్ వేసే కంపెనీ సైట్ విజిట్ తప్పనిసరి అని నిబంధన ఉందని తెలిపారు. హిందూస్థాన్ కాపర్స్ సంస్థలో కూడా సైట్ విజిట్ రూల్ ఉందని, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీస్ లిమిటెడ్ లోనూ సైట్ విజిట్ నిబంధన ఉందని అన్నారు. గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ టెండర్లలోనూ ఆ రూల్ ఉందని, సెంట్రల్ మైనింగ్, డిజైనింగ్ అండ్ ప్లానింగ్ అనే సంస్థ సైట్ విజిట్ అనే నిబంధన పెట్టిందని అన్నారు. రాధాకృష్ణా ఎవరి ప్రయోజనాల కోసం.. ఎవరి కళ్లలో ఆనందం చూడాలని రాశారో? అని ప్రశ్నించారు. రాధాకృష్ణ తన ఆనందం తాను వెతుక్కున్నారని చురకలంటించారు.దేశంలోని చాలా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు సైట్ విజిట్ అనే నింబంధన పెట్టాయని, సైనిక్ స్కూల్, దీన్ దయాళ్ పోర్టు టెండర్ లో కూడా ఇలాంటి నిబంధనలే ఉన్నాయని అన్నారు. అసలు.. సృజన్ రెడ్డి ఎవరు? అని సైట్ విజిట్ పెడితే.. సృజన్ రెడ్డికి ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. సోదా కంపెనీ ఎండి దీప్తి రెడ్డి.. ఆమె కందాల ఉపేందర్ రెడ్డి కూతురు అని.. కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడే సృజన్ రెడ్డి అన్నారు. ఆర్ జి ఒసి-2 సి5 కంపెనీకి ఇచ్చారని, బిఆర్ఎస్ హయాంలో హర్ష కంపెనీ ఎవరిదో అందరికీ తెలుసు అని అన్నారు. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచినా.. బిఆర్ఎస్ తీసుకుని పోయిందని ఎద్దేవా చేవారు. తాను ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదని, రాధాకృష్ణ మీరు తప్పుడు రాతలు రాశారని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని ఒక్క రోజులో ఒక్క కలంతో రాస్తానంటే ఊరుకోమని భట్టి విక్రమార్క హెచ్చరించారు.


