Wednesday, February 4, 2026

 అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఎన్డీయే ఎంపీలకు ప్రధాని  ట్రేడ్ డీల్ అంశం….

- Advertisement -

 అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఎన్డీయే ఎంపీలకు ప్రధాని
 ట్రేడ్ డీల్ అంశం….

న్యూఢిల్లీ, మార్చి 3

PM to NDA MPs on trade deal with US
Trade deal issue….

అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలకు వివరించారు. ఈ ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలకు మైలురాయి అని, సవాళ్లను అధిగమించి సాధించామని మోదీ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో చురుగ్గా పాల్గొని, ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయాలని ఎంపీలకు ప్రధాని సూచించారు. అమెరికా సుంకాలు తగ్గిస్తుందని, భారత్ కూడా తమ వస్తువులపై సున్నాకు తగ్గిస్తుందని ఒప్పందానికి అంగీకరించినట్టు అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే..ఎన్డీయే ఎంపీలతో జరిగిన అంతరంగిక సమావేశంలో అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం, పర్యవసానాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూటమి ఎంపీలు చురుకుగా వ్యవహరించాలని, చర్చల్లో పాల్గొని, ప్రభుత్వ విజయాల గురించి ప్రజలకు నేరుగా తెలియజేయాలని ప్రదాని విజ్ఞ‌ప్తి చేసినట్టు తెలిసింది. పార్లమెంటరీ భాగస్వామ్యం ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీయే ఎంపీలంతా సభలో పూర్తి హాజరును కొనసాగించాలని, కీలక అంశాలపై చర్చలకు సహకరించాలని ఆయన కోరారు.‘ఎంపీలు అందరూ సభలో ఉండాలి, చర్చలో పాల్గొనాలి’ అని ఆయన అన్నట్టు సమావేశం గురించి తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి. నియోజకవర్గ ప్రజలను కలుసుకుని, ఇటీవల సమర్పించిన కేంద్ర బడ్జెట్ ముఖ్య విజయాలను హైలైట్ చేయాలని ఆయన వారిని ఆదేశించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ దీనిని ద్వైపాక్షిక సంబంధాలకు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించిన ఒక మైలురాయిగా అభివర్ణించారు. చర్చల సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను ఆయన బయటపెట్టారు. విమర్శకులు సందేహాలు వ్యక్తం చేశారని, కానీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లిందని మోదీ వివరించారు.‘ప్రజలు విమర్శిస్తున్నప్పటికీ, మేము ధైర్యం కోల్పోలేదు.. మా సహనం ఫలించింది. ప్రపంచ క్రమం మారుతోందని నేను అప్పుడే చెప్పాను’ అని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రదాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ అనంతరం వాణిజ్య ఒప్పందంపై ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందం ప్రకారం, భారతీయ వస్తువులపై ప్రస్తుతం ఉన్న సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడానికి అమెరికా అంగీకరించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది.‘‘భారత ప్రధానమంత్రి మోదీతో ఉన్న స్నేహం, గౌరవంతో పాటు ఆయన అభ్యర్థన మేరకు తక్షణమే అమల్లోకి వచ్చేలా అమెరికా, భారతదేశంమధ్య ఒక వాణిజ్య ఒప్పందానికి మేము అంగీకరించాం.. దీని ప్రకారం పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి అమెరికా తగ్గిస్తుంది’ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో తెలిపారు. అంతేకాదు, అమెరికా వస్తువులపై సుంకాలను సున్నాకు తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉందని అన్నారు. ఇంధనం, సాంకేతికత, వ్యవసాయం, బొగ్గు, ఇతర రంగాలతో సహా 500 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ చెప్పారు.
ఇక, ప్రధాని మోదీ సైతం గొప్ప మిత్రుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
సహనమే భారత్ ను గెలిపించిందన్న మోదీ
దేశాలతో వాణిజ్య చర్చలకు సంబంధించి ప్రభుత్వం స్థిరమైన వైఖరితో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికాతో చారిత్రాత్మక ట్రేడ్ డీల్ కుదిరిన సందర్భంగా ఎన్డీయే కూటమి సమావేశంలో మోదీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లు విధించడంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. సుంకాల విషయంలో తమ ప్రభుత్వాన్ని విమర్శలు చుట్టుముట్టాయని గుర్తుచేసుకున్నారు.అయితే, ప్రభుత్వం మాత్రం సహనంతో వేచి ఉందని, దాని ఫలితం ఈ రోజు అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా కుదిరిన ట్రేడ్ డీల్ తో అనుకూల ఆర్థిక వాతావరణం నెలకొందన్నారు. ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎన్నో దేశాలు వాణిజ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత్‌ మాత్రం ప్రయోజనం పొందుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటనల వెనుక దాగివున్న అజెండా
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశ సార్వభౌమాధికారం, ప్రభుత్వ పారదర్శకత, రైతుల ప్రయోజనాలు, ఇంధన భద్రత వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం బదులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటనలు చేయడంపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ఒప్పందం వల్ల అమెరికాకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని వారు ఆరోపించారు.ఈ ఒప్పందంపై సంతోషించాల్సింది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ అన్నారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, “గతంలో 3-4 శాతంగా ఉన్న టారిఫ్‌ను ఇప్పుడు 18 శాతానికి తగ్గించామని సంబరపడటం ఆశ్చర్యంగా ఉంది. మన దేశానికి సంబంధించిన వాణిజ్య ఒప్పందాల గురించి ట్రంప్ చెప్పడమేంటి? మనం ఇంకా సార్వభౌమ దేశం కాదా? ఏ దేశం నుంచి చమురు కొనాలి, ఎవరితో వ్యాపారం చేయాలో అమెరికా నిర్ణయిస్తుందా? ప్రధాని బదులు ట్రంప్ నుంచి ఇలాంటి కీలక సమాచారం రావడం దేశానికి మంచి సంకేతం కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు.అమెరికా తన ప్రయోజనాలు లేకుండా ఏ ఒప్పందమూ చేసుకోదని, దీని వెనుక కచ్చితంగా రహస్య ఎజెండా ఉందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. “అమెరికా చాలా తెలివైన వ్యాపారి. ఆయుధాల కొనుగోలు లేదా కొన్ని మార్గాల నుంచి చమురు కొనవద్దనే ఒత్తిడి వంటివి దీని వెనుక ఉండొచ్చు. వారు బహిరంగంగా ఒప్పుకోరు కానీ, కచ్చితంగా ఏదో దాగి ఉంది” అని ఆయన అన్నారు.మరో కాంగ్రెస్ ఎంపీ జేబీ మాథర్ మాట్లాడుతూ, “వాణిజ్య ఒప్పందం అయినా, మరో ప్రకటైనా అన్నీ ట్రంపే చేస్తున్నారు. భారత్ అమెరికాకు లొంగిపోయిందా? ఈ ఒప్పందం చుట్టూ ఎన్నో అనుమానాలు అలుముకున్నాయి. వ్యవసాయ ఒప్పందాలు, రైతుల హక్కుల సంగతేంటి? రష్యా నుంచి కాకుండా వెనిజులా, అమెరికా నుంచి చమురు కొనాలనే ఒత్తిడి నిజమేనా? వీటన్నింటిపై స్పష్టత రావాలి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ప్రభుత్వం సభలో దీనిపై చర్చకు సిద్ధపడాలి” అని డిమాండ్ చేశారు.రష్యాతో భారత్‌కు ఉన్న దీర్ఘకాల సంబంధాలను దెబ్బతీసేలా అమెరికా ఒత్తిడి చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉజ్వల్ రామన్ సింగ్ ఆరోపించారు. తక్కువ ధరకు వస్తున్న రష్యా చమురును కాదని, ఎక్కువ ధరకు వెనిజులా నుంచి కొనాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ తర్వాత సోమవారం ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత వస్తువులపై అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించగా, అమెరికా ఉత్పత్తులపై భారత్ కొన్ని వాణిజ్య అడ్డంకులను సడలించింది. ఈ ఒప్పందంతో భారత ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం చెబుతుండగా, దీనిపై పార్లమెంటులో పూర్తి వివరాలతో కూడిన ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
దూరదృష్టితో కూడిన చర్య
భారత్, అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రక మైలురాయి అని అభివర్ణిస్తూ, ఈ ఒప్పందాన్ని ఖరారు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన అభినందనలు తెలిపారు.ఈ ఒప్పందంలో భాగంగా సుంకాలను 18 శాతానికి తగ్గించడం ఒక దూరదృష్టితో కూడిన చర్య అని చంద్రబాబు కొనియాడారు. ఈ నిర్ణయం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని చంద్రబాబు ప్రశంసించారు. ఈ ఒప్పందం వల్ల దేశ ఎగుమతి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, తద్వారా యువతకు, రైతులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని యువత, రైతులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రశంసించిన జేపీ
భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికి గొప్ప శుభవార్త అని పేర్కొంటూ, ఈ విజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్లిష్టమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ, ప్రధాని మోదీ ఎంతో సంయమనంతో వ్యవహరించి జాతీయ ప్రయోజనాలను కాపాడారని ఆయన ప్రశంసించారు.ఈ ఒప్పందంపై జేపీ స్పందిస్తూ, “తీవ్రమైన సవాళ్ల నడుమ జాతీయ ప్రయోజనాలను ప్రోత్సహించడం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో స్నేహాన్ని కాపాడుకోవడం, అదే సమయంలో జాతీయ గౌరవాన్ని నిలబెట్టడం వంటి అంశాలలో ప్రధాని మోదీ ఒక మాస్టర్ క్లాస్ ప్రదర్శించారు” అని కొనియాడారు. భారత్, అమెరికా దేశాలు సహజ మిత్రపక్షాలని, ఈ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ ఒప్పందంతో వచ్చిన నూతనోత్సాహంతో దేశం సమ్మిళిత ఆర్థిక వృద్ధి, శ్రేయస్సు దిశగా మరింత పటిష్టంగా ముందుకు సాగవచ్చని జేపీ ఆకాంక్షించారు. ఇకపై ఒక దేశంగా మనమంతా అసంపూర్తిగా మిగిలిపోయిన ఎజెండాపై దృష్టి సారించి, అభివృద్ధి పథంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్