కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై వీడిన ఉత్కంఠ!
తొలి మేయర్ గా సిపిఐ అభ్యర్థి మూడ గణేష్ నియామకం
భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 16
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువుదీరిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై వీడిన ఉత్కంఠ! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. సోమవారం నూతనంగా ఎన్నికైన 60 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ మేయర్ పీఠం చెరో రెండున్నరేళ్ల కు ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో తొలుత రెండున్నరేళ్ల తొలి మేయర్ గా సిపిఐ అభ్యర్థి మూడ గణేష్ నియామకం జరిగింది. డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ అభ్యర్థి 8వ డివిజన్ లో విజయం సాధించిన సిరిపురపు లలిత ను ఖరారు చేశారు. ఈ కీలక ఘట్టంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపి రామసాయం రఘురాం రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వయంగా రంగంలోకి దిగారు. తమ పార్టీల తరపున గెలుపొందిన అభ్యర్థులను వెంటబెట్టుకొని వారు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కూటమి అభ్యర్థుల్లో ధీమా నింపుతూ, మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా వ్యూహ ప్రతివ్యూహాలతో వారు ముందుకు సాగుతున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థుల గైర్హాజరు కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి కి చెందిన 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు కావాలనే దూరంగా ఉన్నారా లేదా ఇతర రాజకీయ సమీకరణాలు ఏవైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీరి గైర్హాజరు మేయర్ ఎన్నిక ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ మొదలుకానుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకమైన ఈ పీఠం కోసం ప్రయత్నిస్తుండటంతో కొత్తగూడెం రాజకీయాలు వేడెక్కాయి.



