మే 11 నుంచి జనగణన…

- Advertisement -

 మే 11 నుంచి జనగణన…
హైదరాబాద్, మార్చి 4

Census from May 11…
దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.ఈసారి జనగణన ప్రక్రియలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోనుంది. దేశ చరిత్రలోనే మొదటిసారి జనాభా లెక్కలను పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నేరుగా స్మార్ట్‌ఫోన్లలో వివరాలను నమోదు చేస్తారు. ఇది సమాచార సేకరణలో వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, పౌరులు తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునేందుకు “సెల్ఫ్-ఎన్యూమరేషన్” పేరిట ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ మే 11కి 15 రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుందని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు.
పక్కాగా వివరాలు నమోదు చేయాలి: సీఎస్
క్షేత్రస్థాయిలో వివరాల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సీఎస్ స్పష్టంగా ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మండలం భౌగోళిక సరిహద్దులను కచ్చితంగా నిర్ధారించుకోవాలని సూచించారు. మారుమూల గిరిజన తండాలు, పట్టణాల్లోని మురికివాడలతో సహా రాష్ట్రంలోని ఏ ఒక్క కట్టడాన్ని కూడా వదిలిపెట్టకుండా జాబితాలో చేర్చాలని ఆయన స్పష్టం చేశారు. ఈ బృహత్కార్యక్రమం విజయవంతం కావడానికి గణకులు, పర్యవేక్షకులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు.ఈ సమావేశంలో పాల్గొన్న జనాభా లెక్కల విభాగం రాష్ట్ర సంచాలకురాలు భారతీ హోళికెరి, డేటా సేకరణ కోసం రూపొందించిన మొబైల్ యాప్ పనితీరు, సమాచార భద్రతకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ఒక్కరి బాధ్యతలను ఆమె విశదీకరించారు. ఈ డిజిటల్ విధానం వల్ల సమాచార సేకరణలో పారదర్శకత పెరగడంతో పాటు, భవిష్యత్ ప్రభుత్వ పథకాల రూపకల్పనకు కచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular