ఈ నెల 14 నుండి పదవ తరగతి పరీక్షలు శేరిలింగంపల్లి మండలంలో సర్వం సిద్ధం: ఎంఈఓ సభావత్ వెంకటయ్య

- Advertisement -

ఈ నెల 14 నుండి పదవ తరగతి పరీక్షలు
శేరిలింగంపల్లి మండలంలో సర్వం సిద్ధం: ఎంఈఓ సభావత్ వెంకటయ్య

10th Grade Exams Begin on the 14th of This Month
All Arrangements Complete in Serilingampally Mandal: MEO Sabhavath Venkataiah

శేరిలింగంపల్లి, మార్చి 10 (వాయిస్ టుడే):
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శేరిలింగంపల్లి మండలంలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి (ఎంఈఓ) సభావత్ వెంకటయ్య తెలిపారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

2025–2026 విద్యా సంవత్సరానికి గాను శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి మొత్తం 6067 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 13 పాఠశాలల నుండి 652 మంది బాలురు, 676 మంది బాలికలు కలిపి మొత్తం 1328 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 104 పాఠశాలల నుండి 2638 మంది బాలురు, 2101 మంది బాలికలు కలిపి మొత్తం 4739 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఎంఈఓ వెల్లడించారు.

పరీక్ష కేంద్రాలు – సిబ్బంది ఏర్పాటు

పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు మండలంలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో పరీక్షల పర్యవేక్షణ కోసం 418 మంది ఇన్విజిలేటర్లను నియమించడంతో పాటు ప్రతి సెంటర్‌కు ఒక చీఫ్ సూపరింటెండెంట్ (సిఎస్)ను కేటాయించినట్లు వివరించారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, టేబుల్స్, బెంచీలు, అత్యవసర వైద్య సదుపాయాలు వంటి అన్ని వసతులు కల్పించినట్లు సభావత్ వెంకటయ్య పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ అందుకున్న వెంటనే కేటాయించిన పరీక్ష కేంద్రం చిరునామాను ముందుగానే తెలుసుకుని సమయానికి అక్కడికి చేరుకోవాలని సూచించారు. దీంతో ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు… ప్రైవేట్ స్కూళ్ల అరాచకం

ఇదిలా ఉండగా కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించినప్పుడే హాల్ టికెట్లు అందజేస్తామని చెబుతున్నట్లు సమాచారం. ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న కొంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలా లేదా అనే ఆందోళనతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిసింది. దీంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నామని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫీజులతో హాల్ టికెట్‌కు సంబంధం లేదు: ఎంఈఓ

ఈ విషయంపై ఎంఈఓ సభావత్ వెంకటయ్య స్పందిస్తూ, ఫీజులు చెల్లించడం మరియు హాల్ టికెట్ ఇవ్వడం మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు తప్పనిసరిగా అందజేయాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఏవైనా ఫీజు బకాయిలు ఉంటే వాటిని మెమోలు లేదా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీ) ఇచ్చే సమయంలో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఫీజులు కట్టలేదని కారణం చూపి హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ సభావత్ వెంకటయ్య హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular