జ్ఞాపకంగా కృష్ణా ప్యాలెస్’
విజయవాడ, మార్చి 24, (వాయిస్ టుడే )
Krishna Palace: A Keepsake
కృష్ణా నదిపై బ్రిటిషర్ల హయాంలో నిర్మించిన బ్రిడ్జి చరిత్రలో జ్ఞాపకంగా మిగలబోతోంది. 130 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి పిల్లర్ల కూల్చివేతలు మొదలు పెట్టారు. కొత్త డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఈ పాత బ్రిడ్జి పిల్లర్లను కూల్చివేయబోతున్నారు.హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో కూల్చివేతలు సాధ్యం కాకపోవడంతో.. అధికారులు లిమిటెడ్ బ్లాస్టింగ్ విధానంలో కూల్చేందుకు సిద్ధమవుతున్నారు.130 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన బ్రిటీష్ కాలం నాటి రైల్వే బ్రిడ్జి కనమరుగు కాబోతోంది. 1893లో ప్రారంభించిన ఈ బ్రిడ్జి స్థానంలో కొత్తగా డబుల్ లైన్ బ్రిడ్జిని నిర్మించడం కోసం రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. గతంలోనే ఈ బ్రిడ్జిపై ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయగా.. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించి మిగిలిన పిల్లర్లను తొలగించే పనులు చేపట్టారు. రెండు వారాలకు పైగా హైడ్రాలిక్ క్రేన్ల సహాయంతో పిల్లర్లను పగలగొట్టాలని ప్రయత్నించారు.. కానీ వీలు పడలేదు. అందుకే ఈ పిల్లర్లను కూల్చివేసేందుకు లిమిటెడ్ బ్లాస్టింగ్ పద్ధతిలో కూల్చివేతలు ప్రారంభించనున్నారు. ఈ విధానంలో ఒక్కో పిల్లర్‌ను తొలగించకుంటూ పోతారు. దీనికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. 1856 ప్రాంతంలో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎం (మద్రాస్ టు సదరన్ మరాఠా) రైల్వేలో విజయవాడ ఓ భాగంగా ఉండేది. 1893లో కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల పొడవున మీటర్ గేజ్ విధానంలో ఈ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించారు. వంతెన ప్రవేశ మార్గంలో కోట బురుజులను తలపించే రెండు నిర్మాణాలు ఉండటం, అవి చూసేందుకు ప్యాలెస్‌ను తలపించడంతో.. ఈ బ్రిడ్జికి కృష్ణా ప్యాలెస్‌గా పేరు పెట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి స్టీల్ వాడకుండా రాతి బండలు, గానుగ సున్నం సాయంతోనే అత్యంత పటిష్టంగా నిర్మించారు. అందుకే ఇన్నేళ్లు గడిచినా పిల్లర్లను కూల్చడానికి శ్రమించాల్సి వస్తోంది.1897లో ఈ రైల్వే బ్రిడ్జిని బ్రాడ్ గేజ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అనంతరం రైల్వేశాఖ ఈ బ్రిడ్జికి తూర్పు, పశ్చిమ వైపున రైల్వే బ్రిడ్జిలు నిర్మాణం చేసింది. 1985 వరకు ఈ వంతెన సేవలు అందించింది. 1993లో అధికారికంగా ఈ వంతెనపై రాకపోకలు నిలిపేశారు. ఆ తర్వాత కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి వయాడక్ట్‌ను తొలగించగా.. అప్పటి నుంచి ఈ పిల్లర్లు మాత్రమే ఉండిపోయాయి. అయితే ప్రస్తుతం విజయవాడ, గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టడంతో.. డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మించాలని ప్లాన్ చేశారు. అందుకే ప్రస్తుతం చారిత్రక కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జికి సంబంధించి మిగిలిన పిల్లర్లను కూడా తొలగించాలని నిర్ణయించారు.130 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్లను తొలగించొద్దని కోరుతూ గతంలో కొందరు రైల్వే అధికారులకు లేఖలు రాశారు. దీంతో ఈ బ్రిడ్జి జోలికి వెళ్లలేదు.. కానీ ఇప్పుడు డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి కోసం కృష్ణా ప్యాలెస్ వంతెన పిల్లర్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ వంతెన పిల్లర్లను అలాగే వదిలేసి కొంత దూరంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలన్నా అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ పాత బ్రిడ్జిని తొలగించి.. కొత్త బ్రిడ్జిని నిర్మించాలని ప్లాన్ చేశారు. ముందుగా పిల్లర్లను తొలగించే ప్రక్రియను మొదలు పెట్టారు.కానీ వంతెన పిల్లర్లు ఇప్పటికీ పటిష్టంగా ఉండటంతో.. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో వాటిని తొలగించడం సాధ్యం కాలేదు. అందుకే లిమిటెడ్ బ్లాస్టింగ్ విధానంలో ఈ పిల్లర్లను కూల్చే పనులు ప్రారంభించనున్నారు. ఈ విధానంలో తక్కువ మోతాదులో పేలుడు పదార్థాలను ఉపయోగించి, పిల్లర్లకు పగుళ్లు వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో తొలగిస్తారు. దీంతో విజయవాడ చరిత్రలో ‘కృష్ణా ప్యాలెస్’ వంతెన జ్ఞాపకంగా మిగలబోతోంది



