ఒరాకిల్ లో ఏం జరుగుతోంది
హైదరాబాద్, ఏప్రిల్ 2, (వాయిస్ టుడే )
What is happening at Oracle?
టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులపై వేటు వేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఊచకోత రాబోయే రోజుల్లోనూ కొనసాగనున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు భారతదేశంలోని టెక్ హబ్‍లలో కొత్త భయాందోళనలు రేకెత్తిస్తోంది. కంపెనీలు అనుసరిస్తున్న లేఆఫ్ ల కారణంగా ఐటీ నిపుణులు తమ భారీ పెట్టుబడులను పున:సమీక్షించుకుంటున్నారని తద్వారా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడబోతున్నట్లు బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రెండు దశాబ్దాలుగా భారత్‍లో నెక్స్ట్ లెవల్ గా దూసుకుపోయిన భారత ఐటీ సెక్టార్ వృద్ధి వేగంగా ఇటీవల నెలకొన్న పరిణామలతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఒరాకిల్ ఇండియా తరహా పరిణామాలు ఇతర కంపెనీల్లోనూ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే దేశంలోని ఐటీ నగరాలపై తీవ్ర ప్రభావం పడబోతున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగంలో వచ్చిన ఆదాయం ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్ , పూణే, ఎన్ సీఆర్ నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం బలపడటాని వెన్నెముకగా నిలిచింది. కానీ తాజా లే ఆఫ్ లతో ఈ పరిస్థితులు తారుమారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో భారీ ధరలు పెట్టి ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. ఇప్పుడు తమ ఈఎంఐలను చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు రేపు తమకు కూడా ఇదే పరిస్థితి రావొచ్చనే భయంతో తమ నిర్ణయాలను వాయిదా వేసుకునే అవకాశాలు ఉండనుంది.ఐటీ రంగంలో వస్తున్న పెనుమార్పులు ఇప్పుడు సామాన్యుడి సొంతింటి కలపై కోలుకోలేని దెబ్బ తీస్తుండగా ఏఐ ప్రభావం ఐటీ రంగాన్ని మరింత ఆందోళనలోకి నెట్టుతోంది. ఆటోమేషన్ వల్ల ఐటీ కంపెనీల రాబడిలో 2 నుంచి 3 శాతం తగ్గుదల ఉండవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేసింది. 2026లో ఇప్పటివరకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 25 శాతం పడిపోయింది. గతంలో అమెరికా డెవలపర్ల కంటే భారతీయ డెవలపర్లు తక్కువ శాలరీలకే లభిస్తారనే ఆలోచనలతో ఐటీ కంపెనీలు నడిచాయి. కానీ ఇప్పుడు AI కోడింగ్ ఏజెంట్లు విద్యుత్ ఖర్చుతోనే పని పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజాలకు ముప్పు పొంచి ఉందని ‘సిట్రిని రీసెర్చ్’ నివేదిక హెచ్చరించింది. దీంతో రాబోయే రోజుల్లో ఐటీ సెక్టార్ ఎలా ఉండబోతోంది? తద్వారా ఆ రంగంలోని ప్రభావం ఇతర రంగాలపై ఎలా పడబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.



