జాతీయ స్థాయి కార్టూన్ పోటీలో హరి కృష్ణకు ప్రత్యేక బహుమతి
వాయిస్ టుడే న్యూస్ | కృష్ణా జిల్లా
Special Prize for Hari Krishna in National-Level Cartoon Competition

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామానికి చెందిన యువ కార్టూనిస్టు హరి కృష్ణ నాగేశ్వరానికి జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. “World Cartoonist Day 2026” సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి కార్టూన్ పోటీలో ఆయన గీసిన కార్టూన్‌కు ప్రత్యేక బహుమతి లభించింది.
“In times of war, Skip Foreign Travel – Come to Bastar, Where there is peace and Greenery” (యుద్ధ సమయంలో విదేశీ ప్రయాణం వద్దు – శాంతి, పచ్చదనం మెండుగా ఉన్న బస్తర్‌ను సందర్శించండి) అనే అంశంపై ఈ పోటీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రతిభావంతులైన కార్టూనిస్టులు పాల్గొన్న ఈ పోటీలో హరి కృష్ణ తన సృజనాత్మకతతో ప్రత్యేక గుర్తింపు సాధించారు.
ఈ పోటీని ప్రముఖ జాతీయ మాసపత్రిక “Cartoon Watch”, “CACTUS”, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు ఛత్తీస్‌గఢ్ టూరిజం బోర్డు సంయుక్తంగా నిర్వహించాయి.
యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులతో నిండిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ప్రకృతి ఒడిలో లభించే ప్రశాంతతను హరి కృష్ణ తన కార్టూన్‌లో అద్భుతంగా ప్రతిబింబించారు. “Greenery” మరియు “Peace” అనే భావాలను ప్రధానంగా చూపిస్తూ, బస్తర్ ప్రాంతాన్ని శాంతి మరియు సహజ సౌందర్యాల నిలయంగా చిత్రీకరించడం విశేషంగా నిలిచింది.
హరి కృష్ణకు ప్రత్యేక బహుమతి లభించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహ కార్టూనిస్టులు మరియు కళాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలు జాతీయ స్థాయి కార్టూన్ పోటీల్లో బహుమతులు అందుకున్న ఆయన, తన కార్టూన్లతో పుస్తకం ప్రచురించి తన ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా హరి కృష్ణ మాట్లాడుతూ, “ప్రకృతి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అదే భావాన్ని నా కార్టూన్ ద్వారా వ్యక్తపరచడానికి ప్రయత్నించాను. నా కృషిని గుర్తించి ఈ బహుమతి ఇవ్వడం ఆనందంగా ఉంది. కార్టూన్ క్లాసుల ద్వారా కనుమరుగవుతున్న ఈ కళకు పూర్వ వైభవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను” అని తెలిపారు.



