సైకో భర్తల స్టోరీయే అగ్లీ…
హైదరాబాద్, మే 22, ( వాయిస్ టుడే)
The story of psycho husbands is simply ugly.
టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్లో ఒకరైన నందు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘అగ్లీ స్టోరీ’. ఇందులో అవికా గోర్ హీరోయిన్. టీజర్, ట్రైలర్లకు తోడు బ్లింకిట్‌లో టికెట్స్ హోమ్ డెలివరీ అంటూ నందు చేసిన డిఫరెంట్ పబ్లిసిటీ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకు వెళ్ళింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన మేనకోడలు నేహా (అవికా గోర్)ను తమ ఇంటికి తీసుకు వస్తాడు మావయ్య (శివాజీ రాజా). వరుసకు మరదలైన ఆమెపై పిచ్చి ప్రేమ పెంచుకుంటాడు కార్తీక్ (నందు). అయితే నేహాకు చిన్నతనం నుంచి గౌతమ్ అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఆ విషయం తెలిసి సైకోగా మారతాడు. ఆ తర్వాత ఏమైంది?నేహా ప్రేమ విషయం తెలిసి మావయ్య ఏం చేశాడు? అసలు ఇష్టం లేని, చిన్నతనం నుంచి టార్చర్ చేసిన కార్తీక్ ను నేహా ఎందుకు పెళ్లి చేసుకుంది? పెళ్లైన తర్వాత నేహాను కార్తీక్ ఇంకెంత టార్చర్ చేశాడు? గౌతమ్ ఏమయ్యాడు? రక్తపు మడుగులో కార్తీక్, నేహా ఉండటానికి కారణం ఏమిటి? తప్పు ఎవరిది? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ
ఆడ, మగ అనే తేడాల్లేవు… టాక్సిక్ నేచర్, సైకోయిజాన్ని సొసైటీలో నార్మలైజ్ చేస్తున్న జనాలు ఉన్నారు. భార్యను భర్త కొట్టడం తప్పు కాదని చెబుతున్నారు. అది ప్రేమలో భాగం అంటున్నారు. అటువంటి వ్యక్తులను సమర్ధించేవారు, విమర్శించేవారు ఉన్నారు. ఇదొక డిబేటబుల్ టాపిక్. అగ్లీ స్టోరీ దర్శకుడు ప్రణవ స్వరూప్ డిబేట్, డిస్కషన్స్ పెట్టలేదు. వయా మీడియాగా హీరో క్యారెక్టర్ రాయలేదు. తప్పును తప్పు అని చెప్పాడు. ఆ విషయంలో మెచ్చుకోవాలి.అగ్లీ స్టోరీలో హీరో హీరోయిన్స్ క్యారెక్టర్లను, క్యారెక్టరైజేషన్లను ప్రణవ స్వరూప్ క్లారిటీతో రాసుకున్నారు. కార్తీక్ (నందు)ని ముందు నుంచి సైకోగా చూపించారు. చివరి వరకు అదే కంటిన్యూ చేశారు. అయితే సన్నివేశాల విషయంలో కేర్ తీసుకోలేదు. క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేశాక… ఎవరు ఏమిటి? అనేది ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత కథ ముందుకు కదలాలి. కానీ, ఇంటర్వెల్ వరకు హీరో సైకోయిజం బేస్డ్ సీన్స్ వస్తుండటం వల్ల… కథను అక్కడక్కడే తిప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సన్నివేశాలను రిపీట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో కదలిక వచ్చింది. క్లైమాక్స్ చూశాక… నందుకు తగిన శాస్తి జరిగిందని ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు.ఇష్టం లేని పెళ్లి చేసుకుని నరకయాతన అనుభవిస్తున్న అమ్మాయిలు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. ఇష్టం లేనప్పుడు భర్త అయినా సరే ఒంటి మీద చెయ్యి వేస్తే భార్య ఎలా ఫీలవుతుందనేది చూపించారు. భార్యాభర్తల సంబంధంలో సెన్సిబుల్ టాపిక్ (సమ్మతి / అనుమతి) ఇంపార్టెన్స్ చూపించారు. కానీ, హీరో సైకోయిజం – క్యారెక్టరైజేషన్ ముందు ఆ పాయింట్ డైల్యూట్ అయ్యింది. సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు.
దర్శక రచయితగా కన్సెంట్ మీద ప్రణవ స్వరూప్ డిబేట్ పెట్టలేదు. కానీ, ఆయన కథ డిబేటబుల్ టాపిక్. పెళ్లి తర్వాత మరొక మగాడు ఇష్టం అని చెబితే ఏ భర్త అయినా సరే అలాగే రియాక్ట్ అవుతాడని మేల్ చావనిస్ట్స్, పెళ్లికి ముందు ఇష్టం లేదని చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టి టార్చర్ చేయడం తప్పని ఫెమినిస్టులు చెప్పడం గ్యారెంటీ. దర్శకుడికి టెక్నికల్ టీమ్ సపోర్ట్ దక్కింది. శ్రీ సాయి కుమార్ ధారా సినిమాటోగ్రఫీ, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. తక్కువ లొకేషన్స్, మినిమం బడ్జెట్ అయినా క్వాలిటీ వర్క్ ఇచ్చారు. ఆర్ఆర్ బావుంది.స్క్రీన్ మీద ఎవరు ఉన్నా కనిపించినా సరే… ప్రేక్షకుల కళ్లు మాత్రం నందు సైకోయిజం మీదకు వెళ్తాయి. అంతలా పాత్రలో జీవించేశారు. ఆ క్యారెక్టర్ మీద మనకు కోపం వచ్చేలా నటించారు. అపరిచితుడిలా క్షణ క్షణానికి ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఛేంజెస్ చూపిస్తూ తనలోనూ విక్రమ్ లాంటి నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. నందు నటన ఎలివేట్ కావడానికి అవికా గోర్ నటన కూడా కారణం. హీరో చేసే సైకో చేష్టలకు భయపడుతుంటే ఆ పాత్ర మీద జాలి కలుగుతుంది. ఈ సినిమా అంతటా ఆమె క్యారెక్టర్ ఎమోషనల్ గా సాగింది. శివాజీ రాజాది రెగ్యులర్ ఫాదర్ రోల్. అలాగే, రవితేజ మహాదాస్యం రెగ్యులర్ బాయ్ ఫ్రెండ్ రోల్ చేశారు. వాళ్ళిద్దరూ ఆయా పాత్రలకు తగ్గట్టు నటించారు. చివరిలో ప్రజ్ఞ నయన్ పోలీసుగా సర్ ప్రైజ్ చేశారు. ఆమెది చిన్న రోల్.
ఆడియన్స్ అందరిని అగ్లీ స్టోరీ మెప్పించడం కష్టం. సున్నిత మనస్కులు ఆ సైకోయిజాన్ని, భార్య అనుభవించే నరక యాతనను చూడలేరు. అయితే… సమాజంలో మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. సిటీ లైఫ్ లో ఎంతో మంది యువతులు బయటకు చెప్పుకోలేక సైకో భర్తల చేతిలో అనుభవిస్తున్న చిత్రవధకు అద్దం పడుతుంది. కథ కంటే క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని తీసిన చిత్రమిది. సైకో భర్తగా ఓడిన నందు… నటుడిగా గెలిచాడు.



