గోదావరి కాలుష్యంపై పూర్తి నివేదిక
పవన్ ఆదేశం
బోటులో పర్యటించి క్షే్త్రస్థాయి పరిశీలన
రాజమండ్రి, మే 25, ( వాయిస్ టుడే )
Pawan orders full report on Davari pollution, conducts field inspection by boat

గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, మురుగు జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులను,
తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలు ఏంటో తెలపాలని, భవిష్యత్తులో చేయబోయే పనులపై స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాలని
స్పష్టం చేశారు. మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపవద్దని.. గోదావరి, కృష్ణ నదులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.వచ్చే 6 నెలల్లో నదుల్లో కాలుష్యం నిర్వహణలో స్పష్టమైన మార్పు
కనిపించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను ‘కాలుష్యరహిత గోదావరి’ అనే ప్రత్యేక థీమ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం
నిశ్చయిందుకుందని వెల్లడించారు. గోదావరి పుష్కరాలు జూన్ 26 నుండి జూలై 7, 2027 వరకు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం
ఉదయం 6 గంటలకే పవన్ కళ్యాణ్ పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాలు ఘాట్ వరకు పడవలో ప్రయాణించి, గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా
గోదావరి పుష్కరాల పనుల తీరును, త్వరలో చేపట్టబోయే ప్రణాళికలను పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయి, పుష్కరాల నేపథ్యంలో గట్లను
ఎలా తీర్చిదిద్దబోతున్నారు అనే వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం నగర మురుగునీరు గోదావరిలోకి కలిసే
ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నదీ తీరంలో జరుగుతున్న కాలుష్యాన్ని కళ్లారా చూసిన ఆయన, నీటిని శుద్ధి చేస్తున్న విధానంపై ఆరా తీశారు. అక్కడే ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందితో
మాట్లాడి, వ్యర్థాలను వేరు చేసే పద్ధతులను పరిశీలించారు. నగర గృహాల నుండి రోజువారీగా సుమారు 55 ఎం.ఎల్.డి. మురుగునీరు వస్తోందని, ఈ నీటిని శుద్ధి చేసే విధానం పూర్తిగా శాస్త్రీయంగా
జరగాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటిని నేరుగా నదిలోకి వదలడం వల్లే జలాలు కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని
హెచ్చరించారు.గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడేలా, నది తీరాన్ని కాపాడే మంచి పనులకే వినియోగించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేవలం కాగితాల్లో లెక్కలతో
సరిపెట్టకుండా పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. కేంద్ర జల శక్తి ద్వారా ఎన్.ఆర్.సి.పి. నిధులు రూ. 416 కోట్లలో, ఇప్పటికే రూ. 95 కోట్ల నిధులకు పరిపాలన
అనుమతులు వచ్చాయని వెల్లడించారు. ఈ నిధులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించాలని, పూర్తిస్థాయిలో మురుగు లేకుండా జలాలను శుద్ధి చేసిన
తర్వాతే గోదావరిలోకి విడిచిపెట్టే బాధ్యతను అధికారులు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య జలాలు గోదావరిలోకి విడుదల కావడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆరా తీశారు.
దీనిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య స్పందిస్తూ.. ప్రస్తుతం పేపర్ మిల్లు ద్వారా బయటకు వచ్చే వ్యర్థాలను దూరంగా ఉన్న లంక గ్రామాల్లో విడిచి పెడుతున్నారని, దీనికి
ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ మరో ప్రాంతంలో శుద్ధి చేసేందుకు యోచిస్తోందని వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ప్రత్యామ్నాయ పనులు వేగంగా జరిగేలా చూడాలని, అప్పటివరకు సదరు
కంపెనీ మరో సొంత శుద్ధి ప్లాంట్ నిర్మించుకునేలా యాజమాన్యానికి కఠిన ఆదేశాలు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.బోటు ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి మున్సిపల్ కార్యాలయానికి చేరుకునే వరకు
పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని పరిశీలించారు. ప్రత్యక్షంగా ట్రీట్మెంట్ ప్లాంట్ వద్దకు వెళ్లి వేరు చేస్తున్న వ్యర్థాలను చూసి, వాటిని తర్వాత ఏం చేస్తారని అడిగి తెలుసుకున్నారు. వ్యర్థ జలాల శుద్ధికి సరికొత్త
అంతర్జాతీయ విధానాలు వస్తున్నాయని, దానికి అనుగుణంగా అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సూచించారు. అనంతరం పుష్కరాల పనుల ఉన్నత స్థాయి సమీక్ష కోసం రాజమహేంద్రవరం
నగరపాలక సంస్థ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్,
ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పోలీసు హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, అటవీ శాఖ
ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.



