విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదం: మృతుల సంఖ్య 9కి చేరింది
గాయపడిన ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమం
Visakha Steel Plant accident is extremely tragic: Union Minister Kumaraswamy
విశాఖపట్నం, జూన్ 8: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో ఆరుగురు కార్మికులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సోమవారం సాయంత్రం స్టీల్ మెల్టింగ్ షాప్ (SMS)లో సుమారు 1,500 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న 150 టన్నుల మోల్టెన్ మెటల్ లాడెల్ పేలిపోవడంతో దాదాపు 25 అడుగుల మేర హాట్ మెటల్ ఎగసిపడింది. ఘటన సమయంలో సమీపంలో పనిచేస్తున్న కార్మికులపై వేడెక్కిన లోహం పడటంతో తీవ్ర గాయాలపాలై పలువురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల వివరాలు
- గోల్డ్ కుమార్ (మేనేజర్)
- జీవీ అప్పారావు (సైడ్ ఆపరేటర్)
- ప్రభాకరరావు (స్టాండ్-3 ఆపరేటర్)
- జి. భానుకుమార్ (షిఫ్ట్ ఇన్‌ఛార్జ్, స్టాండ్-D)
- కృష్ణ నాగు (స్టాండ్-4 ఆపరేటర్)
- రమణ (పౌడర్ కలాసీ – కాంట్రాక్ట్ వర్కర్)
- త్రినాథ్ (స్టాండ్ ఆపరేటర్ – కాంట్రాక్ట్ వర్కర్)
- ఎన్. అప్పలరాజు (స్టాండ్ ఆపరేటర్ – కాంట్రాక్ట్ వర్కర్)
- గుర్తుతెలియని మరో వ్యక్తి
క్షతగాత్రులు
పైడిరాజు, రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాస్, అర్జున్, అప్పారావు, సత్యానంద్, సూరిబాబు గాయపడ్డారు.
ప్రమాదానికి స్టీల్ మెల్టింగ్ షాప్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇదే యూనిట్‌లో నాలుగు రోజుల క్రితం కూడా హాట్ మెటల్ ఎగసిపడిన ఘటన జరిగినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని వారు పేర్కొంటున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
ప్రమాదం అత్యంత విషాదకరం: కేంద్ర మంత్రి కుమారస్వామి
ఘటనపై స్పందించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రమాదం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వి. అనిత, పల్లా శ్రీనివాస్ రావు, ఎంపీ ఎం. శ్రీభరత్లతో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
అనంతరం గాయపడిన కార్మికులను పరామర్శించిన వారు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.




