వైసీపీ కాపు రాజకీయం…
కాకినాడ, జూన్ 11, ( వాయిస్ టుడే )
Voice Today: Discussion on YCP’s Kapu political strategies – Has the focus on Janasena intensified?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల లక్ష్యంగా చాలా రకాల వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా పార్టీ జనసేన పై ఫుల్ ఫోకస్ పెట్టింది. జనసేన ను దారుణంగా దెబ్బతీయాలని చూస్తోంది. కాపులను జనసేనకు దూరం చేస్తే ఆ ప్రభావం కూటమిపై పడుతుందని.. అదే జరిగితే ఇతర పక్షాల మద్దతుతో చాలా సులువుగా అధికారంలోకి రావచ్చని అంచనా వేస్తోంది. అయితే అది అంత తేలికైన విషయం మాత్రం కాదు. ముఖ్యంగా జనసేన నుంచి కాపులను ఇప్పట్లో వేరు చేయడం కుదిరే పని కాదు. ఎందుకంటే కాపులు పవన్ కళ్యాణ్ విషయంలో కొంత సంతృప్తితో అయితే మాత్రం ఉన్నారు. తమ వాడు డిప్యూటీ సీఎం పదవి వరకు వచ్చాడు అని.. ఏపీలో పాలనలో భాగస్వామ్యం అవుతున్నాడని.. ఆయన నిర్ణయాలకు గౌరవం లభిస్తుందని వారిలో సంతృప్తి ఉంది. అయినా సరే కాపులను విభజిస్తే తప్ప రాజకీయాలు చేయలేమని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాపుల మద్దతు కోసం ఒకవైపు.. జనసేనకు దూరం చేసేందుకు మరోవైపు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు.ప్రస్తుతం కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. కాపు నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కురసాల కన్నబాబు.. ఇలా పేరు మోసిన నేతలంతా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. అయితే వీరి ద్వారా కాపులను ఆకర్షించే ప్రయత్నం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీరు ఆకర్షించే స్థితిలో లేరు. ఎంతవరకు పవన్ పై విమర్శలు చేయగలరే తప్పించి.. వీరికి మరో పని చేతకాదు. పోనీ ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్య లాంటి వారిని తిరిగి ప్రయోగిస్తామంటే కాపులు మరింతగా తిరస్కరిస్తారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు కూడా. అందుకే కొత్త కాపుల కోసం ఆయన అన్వేషిస్తున్నారు. అందుకే దాసరి రాము, వంగవీటి కుటుంబం వంటి వారిపై ఆశలు పెట్టుకున్నారు.పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకోకుండా హరిరామ జోగయ్య పేరు చెప్పుకొని చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో. ఒకవేళ పొత్తు పెట్టుకున్న సగానికి పైగా సీట్లు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ ను కోరమని చెప్పారు. లేకుంటే పొత్తు వద్దు అని తేల్చేయమని సలహా ఇచ్చారు. ఎప్పటికప్పుడు హరి రామ జోగయ్య పేరుతో లేఖలు రాసి పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం అయితే జనసేనలోకి వచ్చి.. తనదైన వైసీపీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని చూశారు. దానిని ముందుగానే గ్రహించారు పవన్ కళ్యాణ్. అందుకే జనసేనలోకి ముద్రగడ ఎంట్రీని లేకుండా చేశారు. ఆ కోపంతోనే ముద్రగడ వైసీపీలోకి వెళ్లారు. పవన్ ను ఓడిస్తానని శపథం చేశారు. ఓడించలేక పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్నారు.జగన్మోహన్ రెడ్డి ముందుగా హరి రామ జోగయ్యను వాడేసారు. తరువాత ముద్రగడ పద్మనాభంను వాడేసారు. ఇప్పుడు కొత్తగా వాడేందుకు దాసరి రాము కనిపిస్తున్నారు. అవసరం అనుకుంటే వంగవీటి కుటుంబంలో ఒకరిని తెచ్చి కాపు రాజకీయంతో కాక రేపాలని చూస్తున్నారు. కానీ వారు ముందుకు వస్తారా లేదా అన్నది చూడాలి.



