రైతు సమస్యలపై తెలంగాణ రక్షణ సేన రౌండ్ టేబుల్.. ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు
నల్గొండ, జూన్ 11: వాయిస్ టుడే
Telangana Rakshana Sena holds round-table on farmers’ issues; Kavitha levels severe criticism against the government.

నల్గొండ జిల్లా కేంద్రంలోని హోటల్ మనోరమాలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలకు స్పష్టమైన విధానం, ఉక్కు సంకల్పం అవసరమని కవిత అన్నారు. రైతును కేవలం ఆర్థిక సహాయం పొందే వ్యక్తిగా కాకుండా దేశానికి అన్నం పెట్టే శక్తిగా చూడాలని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పారిశ్రామిక రంగానికి ఇస్తున్న సదుపాయాలు రైతులకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దేశంలో రైతులు వ్యవసాయం నుంచి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని, రైతు సంఘాలను రాజకీయాలకు అతీతంగా బలోపేతం చేయాలని సూచించారు.
రైతు పండించిన పంటకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించడం అత్యంత కీలకమని తెలిపారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో జగిత్యాల మామిడికి బ్రాండ్ గుర్తింపు తీసుకొచ్చామని, అదే విధంగా నల్గొండ బత్తాయి రైతులకు కూడా మార్కెట్ సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వం తరుగు, రవాణా, ప్యాకింగ్ పేరుతో రైతులపై భారం మోపుతోందని కవిత ఆరోపించారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత, పంటల కొనుగోలు, పంట మార్పిడి అంశాలపై ప్రభుత్వం రైతులతో చర్చించాలని అన్నారు.
నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, చిన్న లిఫ్ట్‌ల నిర్వహణ సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా అందించాలని, రైతు కూలీలకు హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం వెంటనే ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం పది తీర్మానాలు చేసినట్లు కవిత వెల్లడించారు. యూరియా యాప్ తొలగింపు, పెండింగ్ రైతు భరోసా విడుదల, కౌలు రైతులకు గుర్తింపు, నకిలీ విత్తనాలు–పురుగు మందులపై కఠిన చర్యలు, మూసీ కాలుష్య నివారణ, నిమ్మ–బత్తాయి రైతులకు మద్దతు వంటి అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు.
ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని, జీఓ 46 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కూడా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




