గంజాయి రహిత తిరుపతి లక్ష్యం..
రేణిగుంటలో పోలీసుల భారీ అవగాహన సదస్సు..
Goal: A Ganja-free Tirupati…
Police hold massive awareness meeting in Renigunta…
రేణిగుంట
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆదేశాల మేరకు, కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామనగర్‌లో పోలీసులు భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, “మత్తుకు దూరం… ఆరోగ్యంగా ఉందాం” మరియు “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాలతో యువత, విద్యార్థుల్లో చైతన్యం నింపారు. మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, ఆర్థిక నష్టాలను వివరిస్తూ, వాటికి దూరంగా ఉండి విద్య, ఉపాధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల సమాచారం సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్’ వ్యవస్థ గురించి ప్రజలకు వివరించారు. గంజాయి లేదా డ్రగ్స్ అమ్మకాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అలాగే, మత్తు పదార్థాల వినియోగాన్ని త్వరితగతిన గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం ‘బయో-చెక్’ వంటి ఆధునిక స్క్రీనింగ్ కిట్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల ద్వారా డ్రగ్స్ సరఫరా వ్యవస్థను, దాని వెనుక ఉన్న విక్రేతలను గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే, మత్తుకు బానిసలైన బాధితులను కేవలం శిక్షించడమే కాకుండా, వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడంపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గుర్తించిన బాధితులను వెంటనే డీ-అడిక్షన్ మరియు రీహాబిలిటేషన్ కేంద్రాలకు తరలించి, వారికి అవసరమైన వైద్య చికిత్స, మానసిక కౌన్సిలింగ్ అందిస్తారు. చికిత్స పూర్తయిన అనంతరం వారిని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించి, సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా చర్యలు చేపడుతున్నారు. మత్తు రహిత, ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కోసం ప్రజలు, తల్లిదండ్రులు, యువత పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.




