అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీ ప్రచారం…
హైదరాబాద్, జూలై 11, (వాయిస్ టుడే )
Allu Arjun campaigning for a political party…
సోషల్ మీడియా సమాజానికి ఎంత ఉపయోగపడుతోందో, అంతకంటే వేగంగా పనిలేని వారి ఊహా ప్రపంచం గా మారిపోతోంది. ముఖ్యంగా గత రెండు, మూడు రోజులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ సాగుతున్న రాజకీయ ప్రచారం చూస్తుంటే.. అసలు తాను కొత్త పార్టీ పెడుతున్నానన్న విషయమో, లేదా ఒకరి ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తున్నానన్న విషయమో కనీసం అల్లు అర్జున్‌కైనా తెలుసా? అనే అనుమానం రాక మానదు. రాజకీయాల్లో ఉన్న స్నేహితులతో లేదా బంధువులతో ఉండే వ్యక్తిగత అనుబంధాలతో ఒకరిద్దరితో దిగిన ఫోటోలనో, పర్యటనలనో బేస్ చేసుకుని కథలు అల్లేయడం డిజిటల్ మీడియాలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. తన దృష్టిని పూర్తిగా పాన్-ఇండియా కెరీర్ మీదే కేంద్రీకరించిన ఒక టాప్ హీరోను బలవంతంగా రాజకీయాల్లోకి లాగడం వెనుక సోషల్ మీడియా అల్గారిథమ్స్, వ్యూస్ వేట తప్ప మరోటి కనిపించడం లేదు.ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ప్రచారాల్లో ప్రధానంగా మూడు సిల్లీ థియరీలు వినిపిస్తున్నాయి. మొదటిది.. అల్లు అర్జున్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో రహస్య చర్చలు జరిపారని, ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారని కొందరు రాసుకొస్తున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి.. తమిళనాడులో దళపతి విజయ్ తరహాలోనే, బన్నీ కూడా తన మామ చంద్రశేఖర్ రెడ్డి వ్యూహాలతో, పుష్ప సినిమాలలో అరెస్టుతో అవమానించిన రేవంత్ రెడ్డిని కాదని లంగాణలో కొత్త పార్టీ పెట్టి సీఎం అయిపోతారని గాల్లో మేడలు కడుతున్నారు. ఇంకొక వర్గం.. ఏపీలో జగన్ రెడ్డి ప్లాన్ ప్రకారమే అల్లు అర్జున్ అడుగులు పడుతున్నాయని, భవిష్యత్తులో అక్కడ చక్రం తిప్పుతారని సరికొత్త స్క్రిప్ట్ వండి వారుస్తున్నారు.దక్షిణాదిలో సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉందనేది నిజమే. ఎన్టీఆర్, ఎంజీఆర్ లీగసీ నుంచి నిన్నటి పవన్ కల్యాణ్, నేటి విజయ్ వరకు వెండితెర ఇమేజ్‌తో రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు ఉన్నారు. అయితే, ఒక నటుడు రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది అతని వ్యక్తిగత, సిద్ధాంతపరమైన నిర్ణయం. అల్లు అర్జున్ గతంలోనే తాను రాజకీయాలకు న్యూట్రల్ అని, తనకు అన్ని పార్టీల్లోనూ స్నేహితులు ఉన్నారని స్పష్టం చేశారు. కేవలం గతంలో నంద్యాల పర్యటన లేదా హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను బూతద్దంలో చూపిస్తూ.. ఆయనపై రాజకీయ ముద్ర వేయాలని చూడటం సరికాదు. పుష్ప-2 రికార్డుల ప్రభంజనం తర్వాత బాలీవుడ్, టాలీవుడ్‌లలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోగా, వందల కోట్ల మార్కెట్ ఉన్న గ్లోబల్ స్టార్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న బన్నీ.. ఇప్పుడప్పుడే సినిమాలు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ అనుకోరు.ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు, రాజకీయాల్లోకి వచ్చే అర్హత ఉన్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ భవిష్యత్తులో నిజంగానే ప్రజాసేవ వైపు రావాలనుకుంటే.. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా, ధైర్యంగా లౌడ్‌గా అనౌన్స్ చేస్తారు. అంతేకాని, యూట్యూబ్ థంబ్‌నైల్స్ కోసమో, సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసమో పనిగట్టుకుని రాసే కథనాలు పరోక్షంగా ఒక నటుడి క్యారెక్టర్ అస్సాసినేషన్ కు దారితీస్తాయి.




