భయమా..ప్రకాష్ రాజ్ ?
హైదరాబాద్, జూలై 13, ( వాయిస్ టుడే )
Fear… Prakash Raj?
యూట్యూబర్ రావణ్ దేశద్రోహం, ఉపా చట్టం కింద అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఉదంతంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్, ప్రచారం మొదలైంది. దీనిపై ప్రకాష్ రాజ్ నా ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరంటూ కొత్తగా వీడియో విడుదల చేశారు. తాను మౌనంగా లేనని, జనసైనికులు, కొన్ని ఛానళ్లు, యూట్యూబర్లు చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని గమనిస్తున్నానని తెలిపారు. వీటన్నిటికీ దిగజారండి, దిగజారుతూనే ఉండండి అని వ్యాఖ్యానిస్తూ, వారి దిగజారుడుతనాన్ని ప్రపంచం చూస్తోందంటూ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ పైపైన ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా.. లోపల మాత్రం కేసు తీవ్రత చూసి తీవ్ర ఆందోళనలో ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దేశద్రోహం కేసులో ఇరుక్కున్న రావణ్‌తో ప్రకాష్ రాజ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. రావణ్‌తో పాటు కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి, ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యూహాత్మక కుట్రలు చేశారనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. గతంలో రావణ్ చేసిన పలు వివాదాస్పద పోస్టులను, వీడియోలను ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేస్తూ రీట్వీట్లు చేయడం.. ఇప్పుడు ఈ విచారణ తన దాకా వస్తుందనే భయంతోనే ఆయన ప్రశ్నించే గొంతు అంటూ ముందస్తు రక్షణ కవచం వెతుక్కుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రకాష్ రాజ్ కెరీర్ అంతా పరిశీలిస్తే.. ఆయన ఎప్పుడూ సమాజం కోసమో, సామాన్య ప్రజల సమస్యల కోసమో క్షేత్రస్థాయిలో ప్రశ్నించిన దాఖలాలు లేవనేది బహిరంగ రహస్యం. ఆయన వేసే ప్రశ్నలు కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసేలా, ఆయన వ్యక్తిగత, రాజకీయ ఎజెండాలకు ఉపయోగపడేలా మాత్రమే ఉంటాయనే వాదన బలంగా ఉంది. అందుకే ప్రజాసమస్యలపై స్పందించని ఆయన ప్రశ్నల ను సామాన్యులు పెద్దగా పట్టించుకోరు. కానీ, ఈసారి వ్యవహారం కేవలం రాజకీయ విమర్శలతో ఆగిపోయేలా లేదు. ప్రభుత్వ నిఘా వర్గాలు, పోలీసులు ఈ డిజిటల్ కుట్రల వెనుక ఉన్న అసలు లింకులను పక్కా ఆధారాలతో బయటకు తీస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి, నిజాలు పూర్తిగా నిరూపితమైతే ప్రకాష్ రాజ్ సైతం లీగల్ చిక్కులను, కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదని భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారంలో పోలీసుల తదుపరి అడుగులు ప్రకాష్ రాజ్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. అరెస్ట్ అయిన రావణ్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లలో లభ్యమైన కీలక డేటా, చాటింగ్ హిస్టరీతో పాటు.. ఈ ఛానల్‌కు ఫండింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గమన అనే మహిళను పోలీసులు త్వరలోనే విచారించనున్నారు. గమన నోటీసుల విచారణలో తేలే అంశాలు, రావణ్ ఫోన్ డాక్యుమెంట్లు క్రోడీకరిస్తే.. ఈ సోషల్ మీడియా నెట్‌వర్క్ వెనుక ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటనేది అధికారికంగా బయటపడే అవకాశం ఉంది. తెరవెనుక నడిచిన అసలు కథ స్క్రిప్ట్ బయటకు వస్తే, అది ప్రకాష్ రాజ్ కే సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.




