ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ దిశగా స్టీల్ బ్యాంక్ విజయగాథ
ఏడాది పూర్తి చేసుకున్న వినూత్న కార్యక్రమం
Steel Bank’s success story towards plastic-free Husnabad
ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణకు కొత్త దిశ: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, జూలై 17 (వాయిస్ టుడే న్యూస్): పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రారంభించిన “స్టీల్ బ్యాంక్” కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ సంకల్పంతో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం నేడు ప్రజా ఉద్యమంగా మారడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు.
స్వర్గీయ పొన్నం సత్తయ్య సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆయన జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది జూలై 17న తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఏడాది కాలంలో గ్రామాల్లో పర్యావరణ చైతన్యానికి ఇది ప్రతీకగా నిలిచిందన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని కేవలం నిషేధించడం కాకుండా, దానికి శాశ్వత ప్రత్యామ్నాయంగా స్టీల్ పాత్రలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని 276 గ్రామ మహిళా సమాఖ్యలకు 276 స్టీల్ బ్యాంక్ సెట్లను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఒక్కో స్టీల్ బ్యాంక్ సెట్లో 13 రకాల స్టీల్ పాత్రలను 300, 400, 500 పాత్రల సామర్థ్యంతో గ్రామాల అవసరాలకు అనుగుణంగా అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 7,376 స్వయం సహాయక సంఘాలకు చెందిన 80,633 మంది మహిళా సభ్యులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమం కోసం రూ.2.54 కోట్లకు పైగా స్వంత నిధులను వెచ్చించినట్లు మంత్రి తెలిపారు.
గ్రామాల్లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, అన్నదానాలు, గ్రామసభలు, సామాజిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రల వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి గ్రామాలు మరింత పరిశుభ్రంగా మారుతున్నాయని అన్నారు.
హుస్నాబాద్‌ను రాష్ట్రానికే ఆదర్శవంతమైన ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.




