కరీంనగర్ దోపిడి కేసులో కీలక మలుపు.. హుజురాబాద్‌లో గుర్తించిన దొంగల మోటార్‌సైకిళ్లు
Key turn in Karimnagar robbery case: Thieves’ motorcycles found in Huzurabad.
హుజురాబాద్, జూలై 22 (వాయిస్ టుడే): కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో జరిగిన సంచలన దోపిడి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దోపిడీ అనంతరం నిందితులు పారిపోయినట్లు భావిస్తున్న రెండు మోటార్‌సైకిళ్లు హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ సమీపంలో గుర్తించడంతో పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు.
బుధవారం తెల్లవారుజామున భగత్‌నగర్‌కు చెందిన అజ్మాత్ అలీ ఇంటిలోకి చొరబడిన ఐదుగురు దుండగులు ఇంట్లోని వారిని బొమ్మ తుపాకులతో బెదిరించి, ఒక గదిలో బంధించారు. అనంతరం సుమారు రూ.15 లక్షల నగదు, 65 తులాల బంగారం, కిలో వెండి దోచుకుని అక్కడే పార్క్ చేసి ఉన్న రెండు మోటార్‌సైకిళ్లపై పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ మహ్మద్ గౌస్ ఆలం పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుండగా, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో రెండు అనుమానాస్పద మోటార్‌సైకిళ్లను గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, సీఐలు జి. కరుణాకర్, శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ నుంచి డీసీపీ వెంకటరమణ, సీఐ కోటేశ్వర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.
దోపిడీకి పాల్పడిన ఐదుగురు నిందితులు దోచుకున్న సొత్తుతో పాటు మోటార్‌సైకిళ్లను ఈ ప్రాంతంలో వదిలి వెళ్లారా? లేక పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా అక్కడ వదిలారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే నిందితులకు హుజురాబాద్ ప్రాంతంతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై కూడా విచారణ చేపట్టారు.
ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్ కమిషనర్ మహ్మద్ గౌస్ ఆలం 11 ప్రత్యేక గాలింపు బృందాలను రంగంలోకి దించారు. కరీంనగర్ నుంచి హుజురాబాద్ వరకు ఉన్న మానకొండూరు, శంకరపట్నం, హుజురాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలతో పాటు ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్లు మరియు ఆర్టీసీ బస్టాండ్ల సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
దోపిడీ ముఠాను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీస్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు కూడా సమాంతరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.




