ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -

ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత:
మంత్రి పొన్నం ప్రభాకర్

Conserving every drop of water is the social responsibility of every citizen:
Minister Ponnam Prabhakar
ఉస్మానియా విశ్వవిద్యాలయం సైఫాబాద్ సైన్స్ కళాశాలలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం
హైదరాబాద్‌లో భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి  పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, హార్వెస్టింగ్ బోర్‌వెల్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం “ప్రతి నీటి చుక్కను సంరక్షించుకుందాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే నినాదంతో మొక్కలు నాటి, వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైఫాబాద్ సైన్స్ కళాశాల విద్యాబోధనతో పాటు వర్షపు నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి మార్గదర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు.
నేటి పరిస్థితుల్లో ప్రతి వ్యవస్థ నీటిపైనే ఆధారపడి ఉందని, కురిసే వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా వృథాగా కాలువల్లోకి వెళ్లనివ్వకుండా భూగర్భ జలాల్లోకి ఇంకేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో రాతి నిర్మాణాలు, సిమెంట్ రోడ్ల విస్తరణ కారణంగా వర్షపు నీరు సహజంగా భూమిలోకి ఇంకే పరిస్థితి తగ్గిపోయిందని, అందువల్ల నగరంలోని ప్రతి ఇల్లు, ప్రతి సంస్థలో ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
నిజాం కాలం నుంచే హైదరాబాద్‌లో నీటి సంరక్షణ కోసం అనేక చెరువులు నిర్మించారని గుర్తు చేసిన మంత్రి, ఆ సంప్రదాయాన్ని ఆధునిక పద్ధతులతో కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. 2016 నుంచి హైదరాబాద్‌లో భవన నిర్మాణ అనుమతుల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను తప్పనిసరి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
గత కొద్ది రోజులుగా నగరంలో రోజువారీ నీటి ట్యాంకర్ల వినియోగం సుమారు 4 వేల నుంచి 12 వేల వరకు పెరిగిందని పేర్కొంటూ, ఇది రాబోయే నెలల్లో నీటి అవసరం మరింత పెరిగే సూచనగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే 3 వేల నుంచి 4 వేల వరకు బోర్‌వెల్స్ ఎండిపోయాయని, అలాంటి బోర్‌వెల్స్‌కు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తే అవి తిరిగి నీటి నిల్వలను పొందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం హార్వెస్టింగ్ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రజలు కూడా దీనిని తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.
కృష్ణా, గోదావరి, నాగార్జునసాగర్, సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల ద్వారా రైతుల అవసరాలను సమన్వయం చేస్తూ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తున్నప్పటికీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటి సంరక్షణే శాశ్వత పరిష్కారమని మంత్రి అన్నారు.
2024 అక్టోబర్ 2న రాష్ట్రంలో భారీ స్థాయిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమం అమలులో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉండగా, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
త్వరలోనే మంత్రుల నివాసాలు, కార్యాలయాలు, శాసనసభ, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబం తమ ఇళ్లలోనే కాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసేలా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను ఒక ఉద్యమంగా, సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాలని, తద్వారా భావితరాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించగలమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విధానాన్ని అమలు చేస్తోందని, వాహనం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను అందించే కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్  బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్  ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్  ప్రియాంక అల, జలమండలి ఎండీ  అశోక్ రెడ్డి, సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular