వారం రోజుల్లోగా భగత్ నగర్ దొంగలను పట్టుకోవాలి
లేదంటే సీపీ కార్యాలయం ఎదుట ధర్నా
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం
Bhagat Nagar thieves must be caught within a week: Former Minister and MLA Gangula Kamalakar.
కరీంనగర్
కరీంనగర్ నగరంలో శాంతిభద్రతలు మరుగున పడ్డాయని, వరుస దోపిడీలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోక పోవడం వారి చేతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలో ఇటీవల దోపిడీకి గురైన మున్నాభాయ్ కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం పోలీసుల వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా నిందితులను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కమిషనరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
అప్పుడే స్పందిస్తే ఈ గతి పట్టేది కాదు,
జూన్ నెలలోనే తమ కారు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఎమ్మెల్యే గంగుల ఎదుట వాపోయారు. అప్పుడే స్పందించి కారు దొంగలను గుర్తించి ఉంటే, ఇప్పుడు ఈ భారీ దోపిడీ జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కారు ఎత్తుకెళ్లిన దుండగులే పథకం ప్రకారం ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులపై దాడి చేసి సుమారు 62 తులాల బంగారం, రూ. 25 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు అనుమానిస్తున్న వ్యక్తుల సీసీటీవీ ఫుటేజీ ఫోటోలను అందించినప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని గంగుల విమర్శించారు.




