విద్యతోపాటు క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో రాణిస్తారు
ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షలు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది
ఎంత నాణ్యమైన విద్యను అందించాలన్నది ఉపాధ్యాయులు ఆలోచించాలి
సీఎం రేవంత్ రెడ్డి
One excels in life only when discipline accompanies education.
హైదరాబాద్
మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసించిన తర్వాత విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోవు తరాల భవిష్యత్తును మార్చేందుకు, విద్యా రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా పనిచేద్దామని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
“టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్” లో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ దాశరథి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. “12వ తరగతి వచ్చేసరికి మన విద్యార్థులకు ప్రపంచం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండాలి. వారిని ఆ విధంగా తీర్చిదిద్దడంలో ప్రధాన బాధ్యత అధ్యాపకులదే. ఉపాధ్యాయుల సమస్యలు మాకు వదిలేయండి. మీరు అడగకుండానే మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా..” అని ఉపాధ్యాయ సంఘాలను కోరారు. “ప్రపంచ దేశాలు మనవైపు చేసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుదాం. ఐదేళ్లు సమాజం కోసం, తరాల భవిష్యత్తును మార్చేందుకు ప్రతిజ్ఞ తీసుకోండి. దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేయండి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంకా ఏం చేయాలో మీరే సూచనలివ్వండని అన్నారు.
“వచ్చే విద్యా సంవత్సరానికి ఏం చేస్తే బాగుంటుందో డిసెంబరులోగా నివేదిక రూపొందించాలి. ప్రతీ మండలాన్ని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేయండి. విద్యతోపాటు క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో రాణిస్తారు. మీరు ఏది అడగాల్సిన పనిలేదు. మీ బదిలీలు, మీ ప్రమోషన్స్ మీ ఇంటికి పంపించాం. డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలను కేవలం 55 రోజుల్లో భర్తీ చేశాం. ఈ ప్రభుత్వం మీది. మీ కోసం పని చేస్తుంది. మీ సమస్యలను పరిష్కరించే పూచీ నాది. ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడాలి. వచ్చే ఐదేళ్లలో ఈ విద్యా విధానాన్ని మారుస్తాం” అని పేర్కొన్నారు.
“గడిచిన 25 ఏళ్లుగా అమెరికా వైపు చూశాం. చాలా నేర్చుకున్నాం. చాలా గుర్తింపు వచ్చింది. కానీ అమెరికా అంతగా గుర్తింపునిచ్చే దేశం కాదు. ఇప్పుడు మనం ఫోకస్ను షిఫ్ట్ చేయాలి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, చైనా లాంటి దేశాలపైన దృష్టి సారించాలి. ఆ దేశాల్లో అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి” అని చెప్పారు.
“వైట్ కాలర్ జాబ్స్ను రిప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ ఉద్యోగాలపై దృష్టి సారించాలి. విద్య, భాష ప్రావీణ్యం కమ్యునికేషన్కు ఉపయోగపడుతుంది. జర్మనీ, జపాన్, కొరియా లాంటి దేశాల్లో భాష కొంచెంగా తెలిసినా స్కిల్స్ ఉంటే లక్షలాది రూపాయల జీతాలతో ఉద్యోగాలు కల్పించడానికి ఆ దేశాలు ఎదురుచూస్తున్నాయి” అని వివరించారు.
“ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డు, అసైన్డ్ భూములు.. ఇలాంటి సంక్షేమ పథకాల వల్ల జీవితంలో సమూలమైన మార్పులు వస్తాయని నేను ఆశించడం లేదు. అవన్నీ ప్రభుత్వం చేయాల్సిందే. చేస్తుంది. ప్రభుత్వ ఆదాయం పెంచాలి. పేదలకు పంచాలి అనేది మా ఆలోచనే.
కానీ ప్రతి తరానికి ఇదే చేయాల్సిన పరిస్థితి. ఒక తరంలో నేను ఒక డాక్టర్ను, ఇంజనీర్ను తయారు చేస్తే భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం వైపు చూడకుండా, ఈ సమాజంలో వాళ్లను సొంత కాళ్ల మీద నిలబెట్టగలిగిన పరిస్థితి వస్తుంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి ఉపాధ్యాయుల దగ్గరనే ఉంది” అని చెప్పారు
“విద్య రంగంపై బడ్జెట్లో దాదాపు 9 శాతం కేటాయించాం. తెలంగాణలో దాదాపు 27.50 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షలు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు ఆ పిల్లలకు ఎంత నాణ్యమైన విద్యను అందించాలన్నది ఉపాధ్యాయులు ఆలోచన చేయాలి” అని కోరారు.
“గడిచిన మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరిగాయి. ఈ విద్యా సంవత్సరం లక్షకు పైగా చేరారు. మీరు రెండేళ్లు కష్టపడితే దేశంలో 28వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 18 స్థానానికి చేరింది.
2023 డిసెంబర్కు ముందు కూడా ఇప్పుడున్న ఉపాధ్యాయులే ఉన్నారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది ఎందుకు ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల సంఖ్య తగ్గింది? 2024 నుండి ఎందుకు పెరుగుతుంది? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఫోకస్ దేనిపైన ఉంటుందో యంత్రాంగం ఫోకస్ కూడా దానిపైనే ఉంటుంది” అని అన్నారు.
“కొందరు విద్యా మంత్రి తప్పుకోవాలని, దిగిపోవాలని మాట్లాడుతున్నారు. టీమ్ లీడర్గా నేను విద్య మీద ఫోకస్ పెట్టాను. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టాం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ అమలు చేశాం. 14 ఏళ్లుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు లేకపోతే 23 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 30 వేల మందికి పైగా టీచర్లను బదిలీ చేశాం. ఇవన్ని చేసినందుకు దిగిపోవాలా” అని ప్రశ్నించారు.
ఈ సమావేశానికి ముందు ఫిన్లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి వీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు..




