నేతన్నల సంక్షేమం.. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల
సిరిసిల్లలో రూ.3.22 కోట్లతో రగుడు జంక్షన్ అభివృద్ధి పనులకు శ్రీకారం – నేతన్నలకు ఆర్డీ పాస్‌బుక్‌ల పంపిణీ
Government committed to weavers’ welfare and textile industry development: Minister Tummala
రాజన్న సిరిసిల్ల, జూలై 30 (వాయిస్ టుడే): సిరిసిల్ల నేతన్నల సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద రూ.3.22 కోట్ల వ్యయంతో చేపట్టనున్న జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ, మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ప్రారంభించారు.
అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో వస్త్ర పరిశ్రమ కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద ఆర్డీ పాస్‌బుక్‌లు పంపిణీ చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిరిసిల్ల అంటే చేనేతకు ప్రతీక అని, నేతన్నల కష్టానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత రెండేళ్లలోనే చేనేత రంగానికి రూ.1,360 కోట్లకు పైగా నిధులు అందించామని తెలిపారు. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడంతో పాటు భద్రత, బీమా, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం అధిక ధర చెల్లించాల్సి వచ్చినా నాణ్యమైన చీరలనే కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. యార్న్ డిపో ఏర్పాటుతో చేనేత సహకార సంఘాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిరిసిల్ల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, నేతన్నల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సిరిసిల్లలో నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు తయారవుతున్నాయని తెలిపారు. సిరిసిల్ల మోడల్ చీరకు జీఐ ట్యాగ్ తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమ బకాయిలను దశలవారీగా విడుదల చేసి నేతన్నల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. 2024–25లో 6.80 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చి వేలాది మంది నేతన్నలకు ఎనిమిది నెలలపాటు ఉపాధి కల్పించామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3 కోట్ల మీటర్ల చీరల తయారీకి ఆర్డర్లు ఇవ్వగా, ఇప్పటికే దాదాపు కోటి మీటర్ల ఉత్పత్తి పూర్తైందన్నారు. రూ.62 కోట్ల బిల్లులు చెల్లించామని వెల్లడించారు.
అలాగే రూ.2 విద్యుత్ సబ్సిడీ, రూ.50 కోట్లతో వేములవాడలో యార్న్ బ్యాంక్ ఏర్పాటు, కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ సర్కిల్ వద్ద రూ.3 కోట్లతో వస్త్ర తయారీ ప్రక్రియను ప్రతిబింబించే ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలకు మంచి ఆదరణ లభించిందన్నారు. మహిళలు పండుగలు, శుభకార్యాల్లో వాటిని ధరిస్తున్నారని తెలిపారు. మరోసారి కూడా ప్రభుత్వం చీరల తయారీకి ఆర్డర్లు ఇవ్వడం నేతన్నలకు ఉపాధి భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బి. గితే, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.




