16 అడుగులకే గణేశుడి ప్రతిమలు
పోలీస్ శాఖ వార్నింగ్
హైదరాబాద్, జూలై 31, ( వాయిస్ టుడే)
Ganesha idols limited to 16 feet
Police Department issues warning
వినాయక నవరాత్రోత్సవాల నేపథ్యంలో గణేశ్ విగ్రహాల తయారీదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు జారీ చేశారు. విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగులకు మించకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని, రవాణా సమయంలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని.. ఈ సారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీపీ సజ్జనార్ హితవు పలికారు.త్వరలోనే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గణేష్ విగ్రహాల తయారీ ముమ్మరంగా జరుగుతోంది. గణేష్ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే గణేష్ విగ్రహాల తయారీదారులకు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన హైదరాబాద్ సీపీ.. గణేష్ విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతిని 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో తీర్చిదిద్దనున్నారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు. గురువారం గణేష్ విగ్రహాల తయారీదారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన సీపీ సజ్జనార్.. ప్రశాంతంగా, సురక్షితంగా, పర్యావరణహితంగా వినాయక ఉత్సవాలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 23 వేల గణేశ్ విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు గుర్తుచేశారు. వినాయక విగ్రహాల రవాణా సమయంలో జరిగిన 4 ప్రమాదాల నేపథ్యంలో ఈసారి మరింత అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు.
మట్టి గణేష్ విగ్రహాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని.. చిన్న విగ్రహాల ప్రతిష్ఠాపనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీపీ సజ్జనార్ సూచించారు. విగ్రహాల తయారీ కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, సురక్షిత విద్యుత్ వైరింగ్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే లోడింగ్, అన్‌లోడింగ్‌కు ఉపయోగించే క్రేన్లు, వాహనాలు అధికారికంగా ధ్రువీకరించినవే కావాలని పేర్కొన్నారు.ధూల్‌పేట్, జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల నుంచి విగ్రహాల రవాణాకు ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేయాలని తయారీ దారులకు సజ్జనార్ సూచించారు. రద్దీ సమయాల్లో భారీ విగ్రహాల రవాణా చేయవద్దని.. రవాణాకు ముందు ట్రాఫిక్ పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. విగ్రహాల బుకింగ్, రవాణా సమయం, మార్గాల వివరాలను ముందుగానే పోలీసులకు అందించాలని చెప్పారు. విద్యుత్ తీగలు, ఫ్లైఓవర్లు, మెట్రో మార్గాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళికతో విగ్రహాల రవాణా చేపట్టాలని సూచించారు.




