అల్లికల కళాకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన పవన్ కళ్యాణ్
141 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు.. మరో 350 మందికి త్వరలో అందజేత
అమరావతి, ఆగస్టు 6 (వాయిస్ టుడే న్యూస్):
Pawan Kalyan brought new light into the lives of embroidery artisans.
క్రోచెట్ లేస్ కళాకారుల కంటి ఆరోగ్య సమస్యలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే చర్యలకు శ్రీకారం చుట్టారు. దృష్టి లోపాలతో ఇబ్బందులు పడుతున్న 141 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు అందజేయించారు.
గత నెల విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, కళాకారులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలోని పసలదీవికి చెందిన కళాకారిణి మహాలక్ష్మి, గంటల తరబడి సూక్ష్మమైన అల్లికలు చేయడం వల్ల చూపు మందగిస్తోందని వివరించి, నేత్ర పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం క్లస్టర్ల వారీగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు నరసాపురంలో నిర్వహించిన తొలి నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేసిన వైద్యులు 141 మందికి కళ్లజోళ్లు అవసరమని నిర్ధారించగా, వారందరికీ కళ్లజోళ్లు సిద్ధం చేసి పంపించారు.
మరో 350 మందికి కళ్లజోళ్లు.. 20 మందికి శస్త్రచికిత్సలు
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో నిర్వహించిన మరో రెండు నేత్ర వైద్య శిబిరాల్లో కూడా 350 మంది కళాకారుల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి కూడా త్వరలో కళ్లజోళ్లు అందజేయనున్నారు.
అదే సమయంలో 20 మందికి పైగా కళాకారుల్లో కంటిశుక్లం (క్యాటరాక్ట్) సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంకా కొనసాగనున్న నేత్ర వైద్య శిబిరాలు
క్రోచెట్ లేస్ కళాకారుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆచంట, నరసాపురం ప్రాంతాల్లో మరో రెండు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. కళాకారుల ఆరోగ్యం, జీవనోపాధి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.




