త్రిప్రయార్ శ్రీరామస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
ఆలయ సంప్రదాయాలను అనుసరించి ప్రత్యేక పూజలు.. దీపారాధనలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి
Pawan Kalyan visits Triprayar Sriramaswamy Temple.


కేరళ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేరళలోని ప్రసిద్ధ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి చేరుకున్న ఆయన ఆలయ సంప్రదాయాలను అనుసరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయం కేరళలోని ప్రసిద్ధ శ్రీరామ క్షేత్రాల్లో ఒకటిగా, నాలాంబలం యాత్రలో ముఖ్యమైన క్షేత్రంగా పేరొందింది. ఆలయంలో విశిష్ట సేవగా భావించే దీపారాధనలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఒక రోజు దీపారాధన సేవకు విరాళం అందించడంతో పాటు స్వయంగా దీపాలు వెలిగించారు. శ్రీకృష్ణ ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాలకు జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం ఆలయ సంప్రదాయంలో భాగమైన మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ పాల్గొన్నారు. తిరువా నదిలో చేపలకు ఆహారం అందించారు. భక్తుల విశ్వాసం ప్రకారం చేపలకు ఆహారం అందించడం ద్వారా మత్స్యావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు ఆహారం సమర్పించినట్లుగా భావిస్తారు.
1,001 టపాసులకు విరాళం
స్వామివారి దర్శనం అనంతరం వేది వజిపాడు సేవలో భాగంగా 1,001 టపాసులు పేల్చేందుకు అయ్యే మొత్తాన్ని పవన్ కళ్యాణ్ విరాళంగా సమర్పించారు. త్రిప్రయార్ ఆలయంలో ఆలయం తెరిచి ఉన్న సమయంలో బాణాసంచా పేల్చడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
శంఖుచక్రాలతో పాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీరామస్వామి వారి మూలవిరాట్టును పవన్ కళ్యాణ్ దర్శించుకుని సంధ్యాకాల అర్చనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. దక్షిణామూర్తి, వినాయకుడు, అనంతపద్మనాభస్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రామన్ తిరుమేని పూజల అనంతరం పవన్ కళ్యాణ్‌కు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. దేవస్థానం బోర్డు ఛైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు.
పురాణ ప్రాశస్త్యం
త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఇక్కడ శ్రీరామస్వామి విగ్రహాన్ని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ద్వారక సముద్రంలో కలిసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళ తీరానికి చేరినట్లు స్థలపురాణం పేర్కొంటోంది.
కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ శుక్రవారం త్రిప్రయార్ శ్రీరామస్వామిని దర్శించుకుని ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు.




