మాధాపూర్ హోటల్లో యువతి మృతి.. ప్రియుడు పరార్
Young woman dies in Madhapur hotel, boyfriend absconds
మాధాపూర్, సెప్టెంబర్ 22 (వాయిస్ టుడే): మాధాపూర్‌లోని ఓ హోటల్లో ఇరవై తొమ్మిదేళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలిని విశాఖపట్నానికి చెందిన షారన్ నిఖితా టోప్నోగా పోలీసులు గుర్తించారు. ఆమె ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. షారన్ నిఖితా టోప్నో, ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ ఇద్దరూ విశాఖపట్నానికి చెందినవారు. వీరిద్దరూ సెప్టెంబర్ 21న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాధాపూర్‌లోని సిద్ధిఖీ నగర్, రోడ్ నంబర్ 5లో ఉన్న ఓఎస్ఎల్ఎన్ టెర్మినస్ హోటల్లోని గది నంబర్ 304లో బస చేశారు.
అనంతరం షారన్ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన రవి తేజ.. హోటల్ సిబ్బంది సహాయంతో ఆమెను కొత్తగూడలోని అపోలో ఆసుపత్రికి తరలించాడు. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం రవి తేజ ఆసుపత్రి నుంచి పరారయ్యాడు.
మృతురాలి ముఖంపై స్వల్ప గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న క్లూస్ బృందం హోటల్ గదిని పరిశీలించి, ఆధారాల సేకరణ కోసం ఘటనాస్థలాన్ని భద్రపరిచింది.
ఘటన అనంతరం రవి తేజ తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. యువతి మృతికి గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




