దానం చుట్టూనే ఖైరతాబాద్‌ రాజకీయం!

- Advertisement -

నల్లేరు మీద నడక అవుతుందా.. కొత్త అభ్యర్థా?

ఖైరతాబాద్‌ ఉపఎన్నికలో దానం నాగేందర్‌ చుట్టూనే రాజకీయ సమీకరణాలు

Khairatabad politics revolve around Danam!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22: తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన తొలుత సుప్రీంకోర్టుకు వెళ్లనని, ఖైరతాబాద్‌ ఉపఎన్నికను నేరుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించడం కష్టమేనన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది.

చట్టపరంగా అనర్హత వేటు పడినప్పటికీ, తదుపరి జరిగే ఉపఎన్నికలో పోటీ చేయకుండా నిరోధించే నిబంధన ఏదీ లేదన్న వాదన ఉంది. దీంతో ఖైరతాబాద్‌ ఉపఎన్నిక జరిగితే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో ఖైరతాబాద్‌ రాజకీయ పరిస్థితులు దానం నాగేందర్‌ చుట్టూనే తిరుగుతున్నాయి.

వ్యక్తిగత ప్రభావమే ప్రధాన బలమా?

ఖైరతాబాద్‌ నియోజకవర్గ రాజకీయాలను పరిశీలిస్తే పార్టీల సిద్ధాంతాల కంటే దానం నాగేందర్‌ వ్యక్తిగత ప్రభావమే ఇక్కడ ఎక్కువగా పనిచేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఏ పార్టీ అయినా నియోజకవర్గంలోని బస్తీలు, డివిజన్‌ స్థాయి నేతలతో దశాబ్దాలుగా ఆయనకు ఉన్న ప్రత్యక్ష పరిచయాలు, అనుచరగణం ఆయనకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఖైరతాబాద్‌లో ఏ ప్రతిపక్ష పార్టీకీ బలమైన సంస్థాగత క్యాడర్‌ లేకపోవడం కూడా దానం నాగేందర్‌ రాజకీయ నెట్‌వర్క్‌కు అనుకూల అంశంగా మారిందనే చర్చ ఉంది.

కాంగ్రెస్‌ ఓటుబ్యాంక్‌.. దానం వ్యక్తిగత ఇమేజ్‌

పార్టీల సమీకరణాల పరంగా చూస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఖైరతాబాద్‌లో సంప్రదాయ ఓటుబ్యాంకు ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయన వ్యక్తిగత ఇమేజ్‌, బస్తీల్లో ఉన్న పరిచయాలు, కాంగ్రెస్‌ పార్టీ ఓటుబ్యాంకు, పార్టీ శ్రేణుల మద్దతు కలిసి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి తోడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉపఎన్నికలో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

బీఆర్‌ఎస్‌కు సవాలేనా?

ఈ పరిస్థితి బీఆర్‌ఎస్‌కు సవాలుగా మారనుంది. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ స్థాయిలో నియోజకవర్గమంతా పరిచయం ఉన్న ప్రత్యామ్నాయ నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికర అంశంగా మారిందనే చర్చ ఉంది.

గతంలో దానం నాగేందర్‌ చుట్టూనే ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ రాజకీయాలు సాగాయని, ఇప్పుడు ఆయనే ప్రత్యర్థిగా మారిన నేపథ్యంలో ఆయనను ఎదుర్కొనేందుకు బలమైన స్థానిక క్యాడర్‌, సమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేయడం బీఆర్‌ఎస్‌కు కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ పరిస్థితి ఎలా?

మరోవైపు ఖైరతాబాద్‌లో బీజేపీ పరిస్థితి కూడా అంత బలంగా లేదనే విశ్లేషణలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్న సమయంలో బీజేపీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించిందని, ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేసిన సందర్భాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

హైదరాబాద్‌ నగర పరిధిలో బీజేపీకి రాజకీయ ఉనికి ఉన్నప్పటికీ, ఖైరతాబాద్‌లోని బస్తీ ఓటర్లను విస్తృతంగా ప్రభావితం చేసే స్థాయి స్థానిక క్యాడర్‌, బలమైన అభ్యర్థి అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దానంకు ప్లస్‌ పాయింట్లు?

ఖైరతాబాద్‌ ఉపఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడితే, ప్రధాన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ఎంపిక, స్థానిక క్యాడర్‌ బలం కీలకంగా మారనుంది. మరోవైపు దానం నాగేందర్‌కు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, రాజకీయ అనుభవం, స్థానిక బస్తీల్లో ఉన్న పరిచయాలు, కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత బలం వంటి అంశాలు ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే సుప్రీంకోర్టు తీర్పు, ఉపఎన్నికపై ఎన్నికల సంఘం నిర్ణయం, ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, స్థానిక రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయన్నదానిపై ఖైరతాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. atract heading

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular