విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు :మంత్రి పొన్నం ప్రభాకర్
Immediate measures to resolve students’ issues: Minister Ponnam Prabhakar
హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, హాస్టల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల, హాస్టల్‌లోని వసతులను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను స్వయంగా నమోదు చేసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హాస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజూ సిబ్బందిలో ఒకరు విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పర్యవేక్షించాలని సూచించారు. భోజనం, వసతులపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాయ్స్ హాస్టల్‌లో బాత్రూమ్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు.
విద్యార్థుల రవాణా సమస్యలను పరిష్కరించేందుకు బస్సు సదుపాయం కల్పించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల డిపాజిట్‌కు సంబంధించి ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. కళాశాల లైబ్రరీ సమస్యను పరిష్కరించాలని సూచిస్తూ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి చొరవ తీసుకోవాలని కోరారు.
విద్యార్థులకు అవసరమైన స్పోర్ట్స్ కిట్లు అందిస్తామని మంత్రి తెలిపారు. సమీపంలోని స్టేడియాన్ని విద్యార్థులు వినియోగించుకుని క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధ్యాపకులను ఆదేశించారు.
గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. డ్రగ్స్, శాంతిభద్రతలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కళాశాలలో ప్రతిభ కనబరిచే టాపర్లకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని, సైకిళ్లు లేని విద్యార్థులకు సైకిళ్లు అందించే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
విద్యార్థులకు క్యాంపస్ సెలెక్షన్స్, ప్లేస్‌మెంట్స్ కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల రిటైర్డ్ ప్రొఫెసర్లతో మోటివేషనల్ క్లాసులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లక్ష్యంతో చదివితే ఉన్నత స్థాయికి
తాను కూడా విద్యార్థి దశలోనే ప్రజా జీవితంలోకి వచ్చానని మంత్రి తెలిపారు. 1987లో డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా గెలిచి విద్యార్థి సంఘం నాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని గుర్తుచేశారు. విద్యార్థులు చిన్న వయసులోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.
హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, హాస్టల్ భవనాలకు ఏడాది కాలంలోనే శంకుస్థాపన జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
విద్యార్థులకు మంచి ఆహారం, వసతి, రవాణా కల్పించడం తన బాధ్యతగా, నాణ్యమైన బోధన అందించడం అధ్యాపకుల బాధ్యతగా, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం విద్యార్థుల బాధ్యతగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.




