చందానగర్లో 1.5 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
1.5 kg of ganja seized in Chandanagar; two arrested.
చందానగర్, సెప్టెంబర్ 30 ( వాయిస్ టుడే): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక పాలిథిన్ కవర్ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, సెప్టెంబర్ 29, 2026న అందిన విశ్వసనీయ సమాచారంతో చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ సమయంలో పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిని A1 మెరిపాటి మనోజ్ కుమార్ (22), తండ్రి రాంబాబు, ప్రైవేట్ ఉద్యోగి, విశాఖపట్నం వాసిగా, A2 ఎం. ఆశా జ్యోతి (23), తండ్రి దేవుడు, ప్రైవేట్ ఉద్యోగి, ఎస్సీ కాలనీ, ఆంధ్రపోస్టు, లోతుగడ్డ మెంటాడ, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ వాసిగా పోలీసులు గుర్తించారు.
విచారణలో నిందితులు ఒడిశాలోని కుందులి ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలించి, ఇక్కడ విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఎన్.డి.పి.ఎస్ యాక్ట్, 1985లోని సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(B) కింద కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) పరీక్షకు పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




