నల్లగండ్ల చెరువు అభివృద్ధి పనుల్లో లారీ డ్రైవర్లపై దాడి
Lorry drivers attacked during Nallagandla Lake development works.
నాలుగు లారీల విండ్‌షీల్డ్స్ ధ్వంసం.. హిటాచీ ఆపరేటర్‌కు గాయాలు
కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు
చందానగర్, సెప్టెంబర్ 30 (వాయిస్ టుడే): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న నల్లగండ్ల చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా మట్టి తరలిస్తున్న లారీ డ్రైవర్లపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నాలుగు లారీల విండ్‌షీల్డ్స్ ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. హిటాచీ ఆపరేటర్‌పై కూడా దాడి జరగడంతో ఆయనకు గాయాలయ్యాయని తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 28న రాత్రి గోపన్‌పల్లి తండా ఫ్లైఓవర్ కింద నిర్దేశించిన ప్రాంతంలో లారీలతో మట్టి డంపింగ్ చేస్తున్న సమయంలో గోపన్‌పల్లికి చెందిన సుమన్‌తో పాటు మరికొందరు అక్కడికి వచ్చి లారీ డ్రైవర్లతో వాగ్వాదానికి దిగినట్లు ఫిర్యాదు అందింది. అనంతరం రాళ్లు, మట్టి గడ్డలతో లారీ డ్రైవర్లపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు డ్రైవర్లకు గాయాలు కాగా, నాలుగు లారీల విండ్‌షీల్డ్స్ ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు.
అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న హిటాచీ ఆపరేటర్ సునీల్ కుమార్ మెహతాపై కూడా రాళ్లతో దాడి చేసి కింద పడేసి తొక్కినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆయన ఎడమ కంటికి, వీపుపై గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 29న అందిన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు క్రైమ్ నంబర్ 1031/2026 కింద BNS సెక్షన్లు 118(1), 352, 351(2), 324(4) r/w 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




