అమ్మాయి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం..!
హోటల్ రూమ్‌కు పిలిచి పీజీ విద్యార్థిని దారుణ హత్య
Instagram acquaintance… PG student murdered.
మియాపూర్ (వాయిస్ టుడే): ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం ఓ పీజీ వైద్య విద్యార్థిని ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. హన్మకొండలో పీజీ పీడియాట్రిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డికి చెందిన కె. సృజన (27) హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు ఏడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సృజనకు రవికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం క్రితం సృజన వద్ద నుంచి బంగారు గొలుసు తీసుకున్న రవికుమార్, ఆ గొలుసును తిరిగి ఇస్తానంటూ ఈ నెల 29న మియాపూర్‌లోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకుని ఆమెను అక్కడికి రావాలని పిలిచినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో 30న రవికుమార్‌ను కలిసేందుకు సృజన హోటల్‌కు వెళ్లారు. అయితే రెండు రోజులైనా ఆమె తిరిగి రాకపోవడంతో పాటు ఫోన్ స్విచ్‌ఆఫ్ రావడంతో స్నేహితురాళ్లు ఆమె తండ్రికి సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా సృజన మియాపూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు.
హోటల్ గదిని తెరిచి పరిశీలించగా సృజన విగతజీవిగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో పథకం ప్రకారమే ఆమెను హోటల్‌కు పిలిపించి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు రవికుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సృజన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.




