తెలంగాణలోనూ ఎన్డీయే కూటమి వ్యూహం!
ప్రచారంలో దూసుకెళ్తున్న గడల శ్రీనివాసరావు
జనసేన అభ్యర్థికి బీజేపీ మద్దతుపై ఉత్కంఠ.. ఢిల్లీ పెద్దల నిర్ణయంపై ఆసక్తి
The NDA alliance’s strategy in Telangana too!
నల్గొండ, అక్టోబరు 27:
ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదికగా మారుతోంది. ఇతర పార్టీల అభ్యర్థుల ఎంపికపై ఇంకా స్పష్టత రాకముందే జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రచార రంగంలో దూసుకెళ్తున్నారు. గ్రాడ్యుయేట్లు, ఉద్యోగ వర్గాలను లక్ష్యంగా చేసుకుని తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఆయనకు బీజేపీ మద్దతు లభించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఎన్డీయే రాజకీయ బంధం తెలంగాణలోనూ కొత్త రూపం దాల్చనుందా? అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుగానే మాజీ హెల్త్ డైరెక్టర్, పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పరిధిలో సమన్వయకర్తలను నియమించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, యువతను కలుస్తూ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. అభ్యర్థిత్వం ముందుగానే ఖరారు కావడంతో ఇతర పార్టీల కంటే ప్రచారానికి ఎక్కువ సమయం లభించడం ఆయనకు కలిసివస్తోంది.
ప్రచారంలో దూకుడు.. అనుభవమే బలం!
వైద్యశాఖలో ఉన్నతస్థాయిలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం, పరిపాలనా వ్యవహారాలపై అవగాహన, ఉద్యోగులు, పట్టభద్రులతో ఉన్న పరిచయాలు గడల శ్రీనివాసరావుకు సానుకూల అంశాలుగా మారుతున్నాయి. వివిధ వర్గాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ తన అభ్యర్థిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సామాజిక సమీకరణాలు కూడా ఆయనకు అనుకూలించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ప్రకటనలు, ఎన్నికల వ్యూహాలు ఇంకా తుది రూపు దాల్చకముందే జనసేన ప్రచార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
గడలకు బీజేపీ అండ దక్కేనా?
తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జనసేన బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సొంతంగా బలపడాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నప్పటికీ, జాతీయ స్థాయిలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టలేని పరిస్థితి నెలకొందనే చర్చ సాగుతోంది.
బీజేపీ తరఫున కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నాయకులు పలువురు ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనతో అధికారిక పొత్తు పెట్టుకుంటే స్థానిక రాజకీయ సెంటిమెంట్ ప్రభావం చూపే అవకాశముందని కొందరు రాష్ట్ర నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ఏపీలో కొనసాగుతున్న ఎన్డీయే కూటమి బంధాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోనూ జనసేనకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనను జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, సహ ఇన్చార్జుల సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల పొత్తుల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ తరఫున ఉన్న ఆశావహుల పేర్లతో పాటు జనసేన అభ్యర్థి గడల శ్రీనివాసరావు పేరును కూడా జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
కూటమి బలంతో మరింత మైలేజీ!
ఇప్పటికే జనసేన తరఫున ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్న గడల శ్రీనివాసరావుకు బీజేపీ మద్దతు కూడా లభిస్తే ఎన్నికల బరిలో మరింత బలం చేకూరే అవకాశముంది. బీజేపీ క్యాడర్ సహకారం తోడైతే నియోజకవర్గంలోని విస్తృత ఓటర్ల వర్గాలను చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు బీజేపీ నేరుగా పోటీ చేయడం కంటే జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రయోజనకరమనే అభిప్రాయం కొందరు నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో సొంతంగా ఎదగాలన్న బీజేపీ లక్ష్యం ఒకవైపు.. జాతీయ స్థాయిలో ఎన్డీయే భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం మరోవైపు.. ఈ రెండింటి మధ్య కమలనాథులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఢిల్లీ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు వస్తే తెలంగాణలోనూ జనసేన–బీజేపీ రాజకీయ అవగాహనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వేదికగా మారనుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న గడలకు కూటమి మద్దతు కూడా తోడైతే ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారడం ఖాయం.




