ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు కల్పించాలి.. డాక్టర్ గడల శ్రీనివాసరావు
The issues faced by NHM employees must be resolved.
ఖమ్మం: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఖమ్మంలో నిరసన చేపడుతున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులను జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు కలిసి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారికి ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో NHM ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారానికి సంబంధించిన సూచనలను త్రిసభ్య కమిటీకి సమర్పించినట్లు తెలిపారు. అవసరమైతే NHM జేఏసీ ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసే ఉద్యోగుల సంక్షేమానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని డాక్టర్ గడల స్పష్టం చేశారు.




