60 ఏళ్ల తర్వాత కొండగట్టు అంజన్నకు చందనోత్సవం
నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు
20 వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేత.. 21 నుంచి నిజరూప దర్శనం
Chandanotsavam for Kondagattu Anjanna after 60 years
మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆరు దశాబ్దాల తర్వాత చందనోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, వైదిక క్రతువులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు స్వామివారి మూలవిరాట్ దర్శనాన్ని నిలిపివేయనున్నారు. నవంబర్ 21 నుంచి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు.
కొండగట్టు అంజన్నకు ప్రతి మంగళ, శనివారాల్లో సింధూర లేపనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం మూలవిరాట్‌పై సుమారు ఆరు అంగుళాల మేర సింధూరం పేరుకుపోవడంతో దాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం అర్చకులు ప్రత్యేక దీక్షలు చేపట్టనున్నారు. రావి, జువ్వి, మర్రి, మేడి, దరిమి చెట్ల కలపతో సంప్రదాయ పద్ధతిలో సింధూరాన్ని తొలగించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఇద్దరు పీఠాధిపతులు హాజరుకానుండగా, యాగశాలలో 50 మంది రుత్వికులతో త్రికుండాత్మక యజ్ఞం నిర్వహించనున్నారు. ఆలయ రాజగోపురంపై సుదర్శన చక్రం, కలశ స్థాపనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఐదు రోజుల పాటు మూలవిరాట్ దర్శనం ఉండదని, కర్ర ఉత్సవమూర్తి, వేంకటేశ్వరస్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
రూ.20 లక్షలతో ఏర్పాట్లు
చందనోత్సవం కోసం రూ.20 లక్షలు కేటాయించినట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. నవంబర్ 21 నుంచి స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి 12 ఏళ్లకోసారి గోదావరి పుష్కరాల సమయంలో చందనోత్సవం నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. ఆగమశాస్త్ర పండితులు, అర్చకులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




