కులం కోసం జీవితాంతం సేవకుడిగా పనిచేస్తా: కొండ దేవయ్య పటేల్

- Advertisement -

కులం కోసం జీవితాంతం సేవకుడిగా పనిచేస్తా: కొండ దేవయ్య పటేల్

ఒకే కులం – ఒకే సంఘం నినాదంతో ముందుకు సాగాలి
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికలకు సన్నాహాలు
9 మందితో ఎన్నికల కమిటీ.. 33 జిల్లాలకు సమన్వయకర్తల నియామకం

I will serve my community for the rest of my life: Konda Devayya Patel

హైదరాబాద్, నవంబర్ 13: పదవులు, హోదాల కంటే సామాజిక ఐక్యత, కుల అభ్యున్నతే తనకు ముఖ్యమని, ప్రాణం ఉన్నంతవరకు మున్నూరు కాపు సమాజం కోసం ఒక సేవకుడిగా పనిచేస్తానని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ స్పష్టం చేశారు. వ్యక్తిగత పదవుల కోసం కాకుండా సమాజ అభివృద్ధి, ఐక్యత, భవిష్యత్ తరాల అభ్యున్నతి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్వీ మహేందర్ కుమార్ అధ్యక్షతన సంఘం రాష్ట్ర ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి. రాజ్‌కుమార్‌తో కలిసి డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపులందరూ కుల, ప్రాంతీయ, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా ఒక్కతాటిపైకి రావాలని సూచించారు. ‘ఒకే కులం – ఒకే సంఘం’ అనే నినాదంతో సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. సంఘం బలంగా ఉంటేనే సామాజిక సమస్యలపై సమిష్టిగా పోరాడటంతో పాటు విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాజానికి తగిన గుర్తింపు, అవకాశాలు సాధించుకోవచ్చన్నారు.

రాష్ట్రంలో మున్నూరు కాపుల ఐక్యతను మరింత పెంపొందించడంతో పాటు యువత, మహిళలు, విద్యార్థులను సంఘం కార్యకలాపాల్లో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడం, విద్యార్థులను ప్రోత్సహించడం, నిరుద్యోగ యువతకు మార్గనిర్దేశం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అనంతరం సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల నిర్వహణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు తొమ్మిది మంది సభ్యులతో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు సమన్వయకర్తలను నియమించి ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని తీర్మానించారు.

18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పించి, సభ్యుల వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాను రూపొందించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసి త్వరలోనే పూర్తి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిపారు.

సంఘంలో సమిష్టి నాయకత్వం, పారదర్శకత, బాధ్యతాయుతమైన కార్యాచరణకు ప్రాధాన్యతనిస్తూ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నరసింహారెడ్డి, నగర యువజన విభాగం అధ్యక్షుడు ఎడ్ల విశాల్ పటేల్, ఉపాధ్యక్షుడు తోట శ్రవణ్, ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, బూడిద రాజేందర్, గుజ్జు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular