-
ఆగస్ట్.. ఎవరికి ఆనందాన్నిచ్చేనో!
- ఆగస్ట్ రెండో వారంలో మొదటి జాబితాకు బీఆర్‌ఎస్ సిద్ధం
- ఇప్పటికే పేర్లు ఖరారు చేసిన అధినేత
- సార్ ప్లేస్ కూడా మారే సూచన!
- తొలి జాబితాలోనే మూడొంతుల స్థానాలకు పేర్లు ఖరారు!
హైదరబాద్: ‘అన్నా.. నమస్తే.. ఏందన్నా లిస్ట్‌లో నీ పేరుందంటవా? బాస్ లిస్ట్ రెడీ చేసిండంటగా? ఏందోనే.. ఏం తెలుస్తలేదు. ఆ లిస్ట్ ఏందో.. ఆ పేర్లేందో చెప్పేస్తే పనైపోతది కదే! ఈ టెన్షన్ ఏందో.. అర్థమైతల్లేదు’..
రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మేల్యేలు కలిసినా.. దాదాపు ఇదే ముచ్చట మొదలవుతోంది. కారణం.. ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబడే వ్యక్తుల పేర్లను బీఆర్‌ఎస్ అధినేత ఖరారు చేసినట్లు వార్తలు గుప్పుమంటుండడమే. దీంతో.. సిటింగ్‌లు, ఆశావాహులు ఎవరిని కదిపినా.. టికెట్ల గోలే ప్రధానంగా మారుతోంది.
శ్రావణ మాసంలో
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా రెడీ చేసుకున్నారని.. శ్రావణ మాసం ఆరంభం కాగానే మంచి ముహూర్తం చూసుకుని జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. జ్యోతిష్యం, సంప్రదాయాలపై ఎంతో నమ్మకం చూపే కేసీఆర్.. ఆ మేరకు శ్రావణ మాసాన్ని ఇందుకు మంచి సమయంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. శ్రావణ మాసం మొదలయ్యే నాటి నుంచి ఎన్నికలకు దాదాపు మూడు నెలల గడువు ఉంటుంది. దీంతో.. అప్పుడు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే.. వారు కూడా ప్రచారం చేసుకోవడానికి, తమ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో బలోపేతం అవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మూడొంతుల మందితో జాబితా
బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు విషయంలో వినిపిస్తున్న మరో ముఖ్యమైన మాట.. తొలి జాబితాలో మూడొంతుల స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలు. ఈ క్రమంలో ఆయన లక్కీ నెంబర్‌గా భావించే 6 అంకె కలిసొచ్చేలా 69 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత మూడు జాబితాలుగా అభ్యర్థులను ప్రకటించాలనుకన్నప్పటికీ.. అది జాప్యానికి దారి తీస్తుందని, అంతేకాకుండా అసంతృప్తులు, ఆశావాహులు ఇతర పార్టీల వైపు అడుగులు వేసే పరిస్థితులు ఏర్పడతాయనే ఆలోచనతో రెండే జాబితాల్లో మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
అసంతృప్తులను తెలుసుకునే అవకాశం
వీలైనంత ముందుగా అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా పార్టీలో అసంతృప్తులను కూడా కనుక్కోవడం తేలికవుతుందని.. ఫలితంగా వారిని సముదాయించడానికి తగిన సమయం దొరుకుతుందనే మరో ఆలోచన కూడా … ఆగస్ట్‌లో జాబితా విడుదలకు కారణంగా తెలుస్తోంది. ఒకవేళ అసంతృప్తులు రాజీ పడకుండా వేరే పార్టీలోకి వెళ్లినా సంబంధిత నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం కలగకుండా.. నివారణ చర్యలు తీసుకోవడానికి, ఎన్నికల సమయానికి గాడిన పెట్టడానికి వీలవుతుందనే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
వలస నేతలకు కొంత ప్రాధాన్యం
టికెట్ల కేటాయింపులో వలస నేతలకు కొంత ప్రాధాన్యం ఉండే పరిస్థితులు కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. వారిలో ఎక్కువ మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే.. గత ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ హవా సాగిన తరుణంలోనూ వారు గెలవడాన్ని ప్రధాన అర్హతగా గుర్తించి.. మళ్లీ వారికే ఆయా స్థానాల్లో టికెట్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో వలస నేతలకు.. పార్టీలో ఉన్న వారికి మధ్య పొసగక పోవడంతో.. తలనొప్పిగా మారే పరిస్థితి ఏర్పడనుంది. కానీ అలాంటి నియోజకవర్గాల విషయంలో వాస్తవ పరిస్థితులను పూర్తిగా తెలుసుకోవాలని.. ఈ మేరకు సర్వేలు చేయించాలని.. ఆ తర్వాతే జాబితా వెల్లడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమస్యాత్మక నియోజకవర్గాల విషయంలో రెండో జాబితాలో పేర్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
పలువరు సిటింగ్‌లకు.. మొండిచేయి
బీఆర్‌ఎస్ అధినేత ఇప్పటికే చేయించుకున్న సర్వేల ఆధారంగా.. పలువరు సిటింగ్‌లకు మొండి చేయి చూపించే పరిస్థితి ఏర్పడనుందనే సమాచారం వినిపిస్తోంది. హైదరాబాద్‌లోని ప్రముఖులు నివాసం ఉండే ఓ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇప్పటికే చూచాయగా ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. అదే విధంగా.. వరంగల్, నల్గొండ, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ పలువురు సిటింగ్‌లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వీరికి బదులు ఆయా నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను ఇప్పటికే కేసీఆర్ గుర్తించారని, వారికి టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
సారు కూడా.. సీటు మారుస్తారా?
బీఆర్‌ఎస్ అభ్యర్థులు, నియోజకవర్గాల విషయంలో మరో ఆసక్తికర పరిణామంగా.. చర్చనీయాంశంగా మారిన అంశం.. అధినేత కేసీఆర్ కూడా తన సీటు మార్చుకుంటారనే వార్తలు వినిపిస్తుండడం. ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రానున్న ఎన్నికల్లో ఆ స్థానాన్ని వదిలి.. కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సర్వే చేయించుకున్న కేసీఆర్ సిద్దిపేట, దుబ్బాక లలోనూ పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారని.. అయితే.. సిద్దిపేటలో హరీశ్‌రావుకు ఉన్న ఇమేజ్‌ను తగ్గించడం ఇష్టం లేక దాన్ని వదిలేశారని.. తర్వాత దుబ్బాకలో పరిస్థితులు పార్టీకి కొంత ప్రతికూలంగా ఉన్నాయనే సర్వేల నేపథ్యంలో కామారెడ్డిలో పోటీ చేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ.. తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి.. సీఎం సీటుపై కూర్చోబెట్టిన గజ్వేల్ స్థానాన్ని వదులుకోనున్నారనే వార్తలపై విస్మయం వ్యక్తమవుతోంది. గజ్వేల్‌లో గెలుపు కష్టమని భావించే ఆయన వేరే స్థానంపై దృష్టి పెట్టారే విమర్మలు కూడా వినిపిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణపై ప్రభావం!
కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే.. ఆయనకున్న ఇమేజ్‌తో ఉత్తర తెలంగాణ మొత్తంలో సానుకూల పవనాలు వీస్తాయని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. పార్టీకి ఎదురుగాలి వీస్తున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌లలో.. ఈ ప్రభావం కనిపించి పార్టీకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ.. సార్ సిటింగ్ నియోజకవర్గంలోనే పరిస్థితి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో.. త్వరలో వెల్లడించనున్న జాబితాలో ఏ సమీకరణాలు పని చేస్తాయి? తమకు సీటు వస్తుందా? రాదా? అనే చర్చ బీఆర్‌ఎస్ వర్గాల్లో జరుగుతోంది.