టీఎస్ కేబినెట్ నిర్ణయాలు..
సామాన్యుడి గోస పట్టని ప్రభుత్వం
ఎలాంటి హామీలు లేకుండానే చివరి కేబినెట్
నిరుత్సాహంలో యువత, మధ్య తరగతి ప్రజలు
టీఎస్‌ఆర్‌టీసీ విలీన నిర్ణయంలోనూ తేలని లెక్కలెన్నో
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెండో దఫా పాలనలో చివరి కేబినెట్ భేటీ సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీపై విద్యావంతులైన మధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగ యువతలో ఎన్నో ఆశలు కనిపించాయి. అంతేకాకుండా.. వర్ష బీభత్సంతో వేల ఎకరాల్లో పంటలు నష్ట పోయిన రైతన్నలు కూడా తమకు భరోసా కల్పించే చర్యలు ఉంటాయని.. ఆ మేరకు పెద్ద సారు నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ.. వీటన్నిటికీ భిన్నంగా ఏ ఒక్క వర్గానికి సరైన భరోసా లేకుండా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ చివరి కేబినెట్ భేటీ ముగిసింది. దీంతో దీనిపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

బాధితులకు దక్కని భరోసా
ముందుగా కేబినెట్ భేటీ.. నిర్ణయాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో గత పది రోజులుగా విలయతాండవం చేసిన వరద బీభత్సం.. వేల ఎకరాల్లో పంట నష్టం విషయంలో బాధితులకు సాయం విషయంలో స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందని రైతన్నలు ఆశించారు. కానీ.. రూ. 500 కోట్లు మాత్రమే మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తక్షణ సాయం కింద ఎకరానికి పది వేలు పరిహారం ఇచ్చినా.. రూ. 1500 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ.. 500 కోట్ల పరిహారంతో సరిపుచ్చడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులే రూ. 900 కోట్లు ఉన్నాయని వాటిని ప్రభుత్వం వినియోగించట్లేదని.. స్వయంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ… ఆ విషయంలో ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి కనిపించలేదు. అంతేకాకుండా.. వరద నష్టంపై సర్వే జరుగుతోందని, ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక అందలేదని అది రాగానే తగిన చర్యలు తీసుకుంటామని.. హైకోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సోమవారమే తెలిపారు. అంటే.. వరద నష్టం అంచనా, బాధితులకు సాయం విషయంలో ప్రభుత్వం చిత్తుశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వరద రాజకీయం
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్, ప్రత్యర్థి పార్టీ బీజేపీలు వరద రాజకీయం చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండానే కేంద్ర బృందం పర్యటన.. మరోవైపు కేంద్ర బృందానికి ఎలాంటి వివరాలు ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఆయా శాఖలు వరద నష్టం అంచనా చేపడుతున్నాయి. దీంతో.. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు బాధితుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వరదలో బురద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఇతర పార్టీలు, వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఉద్యోగాల ఊసు లేదు
తాజా కేబినెట్ భేటీపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కూడా ఆశలు పెట్టుకుందని.. నూతన నియామకాలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు వెలువడతాయని భావించారు. ముఖ్యంగా డీఎస్సీ నిర్ణయం తీసుకుంటారని వేల మంది బీఈడీ, డీఈడీ విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. కొత్త ఉద్యోగాల మంజూరు విషయంలో ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో యువతలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నియామకాలు జరుగుతున్న పోస్ట్‌లకు అదనంగా దాదాపు 40 వేల ఉద్యోగాల వరకు ఖాళీగా ఉన్నాయని.. వాటి భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటే రాజకీయ పార్టీగా బీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరిగేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉద్యోగులు సైతం తమకు అందాల్సిన బకాయిలు, కొత్త పీఆర్‌సీ, పెన్షన్ విధానంపై నిర్ణయాలు వెలువడుతాయని ఆశించారు. కానీ వారికీ కేబినెట్‌లో మొండిచేయి చూపించారు.
సామాన్యులపై శీతకన్ను
ఇక.. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో అన్ని రకాల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్య తరగతి వర్గాలు.. ప్రభుత్వం నుంచి ధరల అదుపు విషయంలో ఏదైనా నిర్ణయం ఉంటుందని భావించాయి. కానీ మిడిల్ క్లాస్ వర్గాలు తమకు అవసరం లేదనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని తాజా కేబినెట్ సమావేశం ద్వారా భావించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రైతుబజార్లు, రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలను సబ్సిడీపై ఇచ్చే దిశగా ఏమైనా చర్యలు, నిర్ణయం తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ విలీనం కూడా వ్యూహమే
మరోవైపు నిన్న కేబినెట్ భేటీ జరిగినప్పటి నుంచి చర్చనీయాంశంగా మారిన అంశం.. టీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించడం. అయితే.. దీంట్లో రాజకీయ వ్యూహం దాగుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 43 వేలకు పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా తమది కార్మిక శ్రేయస్సు కోరే ప్రభుత్వం అనే సంకేతాలను తీసుకెళ్లాలని వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కేవలం ఆర్‌టీసీనే కాకుండా.. ఇతర కార్మికులను కూడా తమవైపు తిప్పుకునే వ్యూహం ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. ఆర్‌టీసీని విలీనం చేసినా.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపుపై స్పష్టమైన నిర్దేశాలు లేకపోవడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బకాయిల చెల్లింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే విలీన చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు.
మెట్రో విస్తరణతో.. జరిగేందేంటి
కేబినెట్ భేటీలో తీసుకున్న మరో నిర్ణయం మెట్రో విస్తరణ. నగరం నలువైపులా మెట్రో విస్తరణకు ఆమోదం తెలుపుతూ అందుకు రూ. 60 కోట్ల కేటాయింపు కూడా జరిగింది. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో రహదారుల వ్యవస్థను బాగు చేయకుండా మెట్రోకు పెద్ద పీట వేయడం ఏంటనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మెట్రో రైళ్లు వస్తే ట్రాఫిక్ తగ్గుతుందనే మాటలు కూడా సత్యదూరం అని ప్రస్తుత మెట్రో మార్గాలు రుజువు చేస్తున్నాయని.. మెట్రో కారిడార్‌లోనే ట్రాఫిక్ కూడా పెరుగుతున్న విషయాన్ని గుర్తించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రహదారుల విస్తరణ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీలోనూ.. ఇదే తరహాలో
ఇక.. ఆగస్ట్ మూడు నుంచి తెలంగాణలో రెండో దఫా అసెంబ్లీ చివరి సమావేశాలు జరగనున్నాయి. వీటిని కూడా ముచ్చటగా మూడు రోజుల్లో ముగించేయాలని.. ఈ వ్యవధిలోనూ కాంగ్రెస్‌పై విరుచుకుపడడమే ఎజెండాగా బీఆర్‌ఎస్ బాస్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో.. రూ. కోట్ల ప్రజాధనంతో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు నిర్మాణాత్మకంగా జరగవని.. ఇది ప్రజల్లోకి వెళితే పార్టీగా బీఆర్‌ఎస్ నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మొత్తంగా చూస్తే.. అధికార బీఆర్‌ఎస్ పాలనను గాలికొదిలేసిందని.. సామాన్యుల గోస పట్టించుకోవట్లేదని.. పూర్తిగా ఎన్నికల ఎత్తుగడలకే సమయం కేటాయిస్తోందనే విమర్శలకు.. ప్రభుత్వ తాజా నిర్ణయాలు ఊతమిచ్చినట్లు అవుతోంది.


