గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు
శ్రీనగర్: గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. ఇది కాస్త శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం లో కార్యకలాపాల అంతరాయానికి దారితీసింది. అధికారుల వివరాల ప్రకారం.. ఎయిర్ విస్తారా కు చెందిన ఓ విమానం 178 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయల్దేరింది. అయితే.. ఆ ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ శ్రీనగర్ ఎయిర్‌పోర్టులోని ‘ఏటీసీ ’కి సమాచారం అందింది. దీంతో అధికారులు, భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
ఆ ఫ్లైట్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను, సిబ్బందిని కిందికి దించివేశారు. అనంతరం దాన్ని ఖాళీ ప్రదేశానికి తరలించి.. బాంబు స్క్వాడ్ బృందాలు, జాగిలాల సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలేమీ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామాలతో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు కార్యకలాపాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు చెప్పారు……