అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో హెచ్. ఎల్. సి వంతెన కుప్పకూలింది. గంగలాపురం గ్రామం నుండి కనేకల్ కు వడ్లు బస్తాలతో ఇచర్ వాహనం వెళ్తున్న సమయంలో వంతెన దాటుతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలి ఇచర్ వాహనం కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. వడ్లు బస్తాలు నీళ్ళలోకి పడకుండా స్థానికులు బయటకు తీశారు. బ్రిడ్జ్ శిధిలావస్థకు చేరుకొని చాలా సంవత్సరాలు అవుతుందని గ్రామస్తులు తెలిపారు.ప్రజాప్రతినిధుల అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం వల్లే కనేకల్లు -గంగలాపురం వంతెన కూలిపోయిందని మాజీమంత్రి, కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.ఆయన కనేకల్లు టిడిపి నాయకులతో కలిసి హెచ్చెల్సీపై కూలి పోయిన వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ రెండేళ్లుగా వంతెన ప్రమాదకర స్థితిలో ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.



