సమగ్ర భూ సర్వే నిర్వహించి ధరణి లోపాలను సవరించాలి. వై వి.
సమగ్ర భూ సర్వే నిర్వహించి ధరణి లోపాలను సవరించాలని, తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు కోరారు. తెలంగాణ లో 2.45 లక్షల ధరఖాస్తులకు గాను 1.10లక్షల ధరఖాస్తులు పరిష్కరించినట్లు అధికారులు తెలియ జేశారు. ధరణిలో ఉన్న లోపాలను సరిచేయడం ద్వారా భూమాత పథకాన్ని రైతులకు అందుబాటులోకి తేవాలని సమావేశం కోరుతున్నది. గత ప్రభుత్వం “పాసుపుస్తకాల చట్టం – 1971” లోని సెక్షన్ 26ను మార్పు చేసింది. గత లోపాలకు తోడు, అదనపు లోపాలతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
పల్లెప్రకృతివనం, డంపింగ్ యార్డులు, స్మశానవాటికలు, డబుల్ బెడ్రూం, ప్రాజెక్టులు, రహదారుల పేరుతో పేదల భూములను నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పుల వలన, అనగా రికార్డులు ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు రాయడంతో లక్షలాది మందికి పాసుపుస్తకాలు రాలేదు. దీనిపై వేసిన కేబినెట్ కమిటీ ధరణి లోపాలవల్ల 13లక్షల మందికి పానుపుస్తకాలు ఇవ్వలేదని నివేదిక ఇచ్చింది.
ధరణి చట్టంలోని సెక్షన్-8లో వారసత్వంగా వచ్చిన ఆస్థిని కూడా వారసులకు రిజిస్ట్రేషన్ చేయాలని, అందుకు మ్యుటేషన్ ఫీజు చెల్లించాలని నిర్ణయించారు. వారసత్వంగా వచ్చే ఆస్తికి ధరణి నాటికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు గాని, ఛార్జీలుగాని లేవు. కుటుంబ “భాగస్వామ్య పత్రం (పైస్థానామ)” ద్వారా వారసత్వ హక్కులు మార్చాలి. పురాతన కాలం నుండి వస్తున్న రెవెన్యూ రికార్డుల్లోని “సాగుదారుల కాలం (ఖాస్తు కాలం)ను తొలగించారు. దీని వల్ల వాస్తవ సాగుదారులకు నష్టం వాటిల్లింది, తెలంగాణలో సాదాబైనామాలపై కొనుగోలు చేసినవారు, కౌలుకు చేసేవారు. భూములు తాకట్టుపెట్టిన వారు తమ హక్కులు కోల్పోయారు. దాన్ని గత ప్రభుత్వం తొలగించడం వల్ల లక్షల మంది తమ స్వాధీనపు హక్కును కోల్పోయారు. రెవెన్యూ రికార్డుల్లో తిరిగి సాగుదారుల కాలం (కౌలుదారుల కాలం)ను పెట్టాలి. గతంలో తహశీల్దారు. ఆర్డీవో, కలెక్టర్ కోర్టుల్లో రెవెన్యూ కేసులు ఫైల్ చేశారు. ఈ మూడు కోర్టులను గత ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఆ కోర్టుల్లో నడుస్తున్న 16,140 కేసులను రద్దు చేశారు. ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రతి వివాదం ఉన్న రైతు సివిల్ కోర్టుకు వెళ్ళడం సాధ్యంగాని పని, అందువల్ల రైతులకు అందుబాటులో ఉన్న రెవెన్యూ కోర్టులను పునరుద్ధరించాలి.
భూముల రిజిస్ట్రేషన్లో “22ఎ నిషేధ రిజిస్టర్”ను విస్తరించారు. గతంలో ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములు, అడవి బంజర్లకు మాత్రమే వర్తించిన ఈ నిషేధ చట్టాన్ని పట్టాదారులకు కూడా అన్వయింపజేశారు. ఒక భూమిలో కొంతభాగం రిజిస్ట్రేషన్ చేసినచో మిగతా భూమిని 22ఎ క్రింద నిషేధించారు. నిషేధపు రిజిస్టర్లో నుండి వాస్తవ హక్కుదారుల భూములను తొలగించాలి.
గ్రామసభల ద్వారా కౌలుదారులను గుర్తించాలి. ఒక సంవత్సరానికి ఉపయోగపడే విధంగా “లోన్ ఎలిజబిలిటీ కార్డు”నుఇవ్వాలి. ప్రస్తుతం ధరణి చట్టంలోని లోపాలను సవరించుటకు కొత్తగా సవరణ చట్టాలు చేయాలి.
గత ప్రభుత్వం 13 లోపాలను సరిచేయడానికి “ఒక మాడ్యూల్” నిర్ణయించి ప్రతి రైతునుండి రు.1650లు మీ సేవద్వారా చెల్లించి పై లోపాలను సరిచేసుకోవాలని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి పై లోపాలు ప్రభుత్వ అధికారుల ద్వారా జరిగినవి మాత్రమే. వాటిని సరిచేయడానికి రైతులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వేలాది రూపాయలు రైతుల నుండి అక్రమంగా వసూలు చేసింది. ఫీజు చెల్లించినవారికి కూడా నేటికీ ఎలాంటి సవరణలు చేయలేదు. అందువల్ల ధరణి చట్టం ద్వారా వచ్చిన లోపాలను “డిజిటలైజేషన్ లోపాల పేరుతో” గత ప్రభుత్వం దాటవేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిచేయడానికి గ్రామాల్లో సభలు ఏర్పాటు’ చేయడం ద్వారా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి సరిచేయాలి.
1940లో రాష్ట్రంలో భూసర్వే జరిగింది. నేటి వరకు ఎలాంటి సర్వేలు జరగలేదు. అక్రమార్కులు రికార్డులను మార్పులు చేశారు. భూసర్వే జరపడానికి ఈ ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేయాలి. కొనుగోలు చేసిననాటి రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) ను అమలు చేయాలి. దేవాదాయ, ధర్మాదాయ, వక్స్, భూదాన భూములను సర్వే చేసి భూ అక్రమణల నుండి రక్షించాలి.
కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ, సీలింగ్, బంజర్లను పేదలకు పంచాలి. 1973 భూ సంస్కరణల చట్టంలోని లోపాలను సరిదిద్దాలి. క్యాబినెట్ ఆమోదంతో సీలింగ్ చట్టాలకు తూట్లు పొడిచే విధంగా గత ప్రభుత్వం భూములను కేటాయించింది. భూసేకరణ సందర్భంగా లావోణి, అసైన్డ్ భూములకు మార్కెట్ ధర చెల్లించాలి. లేదా భూమికి భూమి ఇచ్చి భూసేకరణ చేయాలి. ధరణి చట్టం లోని లోపాలను సవరణ చేస్తూ శాసనసభలో ఆమోదించి చట్టం చేయాలి. విఆర్ వ్యవస్థను పునరుద్దరించాలి. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని వీరాంజనేయులు కోరారు.



